వామ్మో చలి.. పడిపోతున్న కనిష్ఠ ఉష్ణోగ్రతలు
తెలంగాణలో చలి తీవ్రత మళ్లీ పెరిగింది. చలితో జనాలు గజగజ వణికిపోతున్నారు. ఉదయం 10 గంటల వరకు చలి తీవ్రత ఉంటోంది. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయిలో పడిపోయాయి. చలితో పాటు పొగ మంచు అధికంగా ఉంది. దీంతో ఉదయం పూట వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయాన్నే వాకింగ్ కు వెళ్లేవారు మాస్కులు ధరించాల్సి వస్తోంది. రాష్ట్రంలో అత్యధికంగా 28 డిగ్రీలు, అత్యల్పంగా 11 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రెండు రోజుల పాటు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్ జిల్లాలో కనిష్టంగా.. 9.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పటాన్ చెరులో 11, మెదక్ 13.3 డిగ్రీలు, రామగుండంలో 14.5, హన్మకొండలో 15 డిగ్రీలు, హైదరాబాద్ 15.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ ప్రకటించింది.