Home Page SliderInternational

శ్రీలంక మాజీ అధ్యక్షుడికి సుప్రీంకోర్టు భారీ జరిమానా

శ్రీలంక మాజీ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనకు అక్కడి సుప్రీంకోర్టు భారీ జరిమానా విధించింది. దాదాపు 2.2కోట్ల రూపాయలు ఆయన జరిమానాగా చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే 2019లో ఉగ్రదాడులను నిర్మూలించడంలో అప్పటి ప్రభుత్వం విఫలమైన విషయం తెలిసిందే. దీంతో శ్రీలంక సుప్రీంకోర్టు మాజీ అధ్యక్షుడితో పాటు మరో 4గురు సైనిక ఉన్నతాధికారులు రూ.31 కోట్ల రూపాయల జరిమానా చెల్లించాలని ఆదేశించింది.

ఈ జరిమానా మొత్తాన్ని అప్పటి ఘటనలో బాధితులకు నష్టపరిహారంగా చెల్లించాలని తీర్పు ఇచ్చింది. 2019 లో శ్రీలంక రాజధాని కొలంబోలో ప్రార్థనామందిరాలు,ప్రముఖ హోటల్స్‌లో జరిగిన ఉగ్రదాడిలో 270 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా ఈ ఉగ్రదాడిలో దాదాపు 500 మంది క్షతగాత్రులయినట్లు అప్పటి నివేదికలు వెల్లడించాయి. అయితే ఈ ఉగ్రదాడి జరగడానికి ముందే ఇంటెలిజన్స్ వర్గాల నుంచి దాడికి సంబంధించి శ్రీలంక ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ అయినట్లు సమాచారం. అయినప్పటికీ వాటిని మైత్రిపాల సిరిసేన ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం కారణంగానే అనేక మంది ప్రాణాలు కోల్పోయారని పలు ఆరోపణలు వచ్చాయి. దీనిపై బాధిత కుటుంబాలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. వీటిని విచారించిన 7గురు సభ్యుల సుప్రీం ధర్మాసనం తాజాగా తీర్పునిచ్చింది. కాగా మాజీ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనతోపాటు మరో నలుగురు సైనిక ఉన్నతాధికారులపై సుప్రీంకోర్టు భారీ జరిమానా విధించింది.