మాజీ మంత్రి బెయిల్ రద్దు
మాజీ మంత్రి, టీడీపీ నేత పి.నారాయణకు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పదో తరగతి పరీక్ష పేపర్ లీక్ కేసులో చిత్తూరు జిల్లా కోర్టు బెయిల్ రద్దు చేసింది. టెన్త్ క్లాస్ పేపర్ లీక్ కేసులో నారాయణపై చిత్తూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనను గత ఏప్రిల్‌లో అరెస్ట్ చేయగా, కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దాంతో చిత్తూరు వన్ టౌన్ పోలీసులు 9వ అదనపు జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నారాయణ బెయిల్ రద్దు చేయాలని కోరారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం… నారాయణ బెయిల్ రద్దు చేసింది. నవంబరు 30వ తేదీ లోపు పోలీసుల ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది.
ఏప్రిల్ 27, 2022న చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం నెల్లేపల్లిలోని జడ్పీ హైస్కూల్ నుంచి టెన్త్ క్లాస్ పేపర్ లీకైంది. వాట్సాప్ ద్వారా పేపర్ బయటకు రావడంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో నారాయణ పాత్ర ఉన్నదని చిత్తూరు పోలీసులు తెలిపారు. అనంతరం నారాయణను అరెస్ట్ చేసి చిత్తూరు కోర్టులో ప్రవేశపెట్టారు. నారాయణ విద్యా సంస్థల అధినేతగా ఉన్న నారాయణను 2014లోనే వైదొలిగారంటూ ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దానికి సంబంధించిన ఆధారాలను సమర్పించారు. దీంతో న్యాయస్థానం నారాయణకు అప్పట్లో బెయిల్ మంజూరు చేసింది. తాజాగా ఆ బెయిల్‌ను రద్దు చేస్తున్నట్లు చిత్తూరు కోర్టు వెల్లడించింది.