NewsTelangana

కాంగ్రెస్‌లోనే ఉన్నా.. వేటు తప్పదా..?

మునుగోడు ఉప ఎన్నిక భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మెడకు చుట్టుకుంది. కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీ తరఫున పోటీ చేసిన తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి వెంకట్‌ రెడ్డి పరోక్షంగా సాయం చేసిన ఆడియో, వీడియో లీక్‌ అయ్యాయి. కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసిన పాల్వాయి స్రవంతికి ప్రచారం చేయకుండా వెన్నుపోటు పొడిచారని వార్తలొచ్చిన నేపథ్యంలో ఆయనకు పార్టీ అధిష్టానం షోకాజ్‌ నోటీసు ఇచ్చింది. ఈ నోటీసుకు తాను రెండు రోజుల క్రితమే జవాబిచ్చానని వెంకట్‌రెడ్డి చెప్పారు. కాంగ్రెస్‌ జాతీయ నేత జైరాం రమేశ్‌ మాత్రం వెంకట్‌రెడ్డి తీరుపై సీరియస్‌గా ఉన్నారు. పార్టీలో క్రమశిక్షణ ముఖ్యమని.. గీత దాటితే చర్యలు తప్పవని ఘాటుగా చెప్పారు.

షోకాజ్‌ నోటీసుకు జవాబిచ్చా..

దీంతో కాస్త వెనక్కి తగ్గిన వెంకట్‌ రెడ్డి తాను పార్టీలోనే ఉన్నానని.. షోకాజ్‌ నోటీసుకు రెండు రోజుల క్రితమే సమాధానం ఇచ్చానని.. క్రమశిక్షణా కమిటీ చైర్మన్‌ తారిఖ్‌ అన్వర్‌ అందుబాటులో లేకపోవడంతో ఆయనకు అందలేదని వివరించారు. షోకాజ్‌ నోటీసులో ఉన్నందున తెలంగాణాలో రాహుల్‌ గాంధీ పాదయాత్రలో పాల్గొనలేదని.. క్లీన్‌చిట్‌ రాగానే రాహుల్‌ చేపట్టిన భారత్‌ జోడో యాత్రలో పాల్గొంటానని వెంకట్‌రెడ్డి తెలిపారు. మునుగోడులో రాజగోపాల్‌ రెడ్డి ఓడిపోవడంతో వెంకట్‌రెడ్డి కాస్త వెనక్కి తగ్గినట్లు కనబడుతోంది. లేకుంటే.. తానూ ఎంపీ పదవికి రాజీనామా చేసి బీజేపీ తరఫున భువనగిరి నుంచి మళ్లీ పోటీ చేయాలని భావించినట్లు వార్తలొచ్చాయి. ఇప్పుడు పరిస్థితి ప్రతికూలంగా ఉండటంతో కాంగ్రెస్‌లోనే కొనసాగేందుకు మొగ్గు చూపినట్లు వెంకట్‌రెడ్డి అనుయాయులు చెప్పుకుంటున్నారు.