కేసీఆర్‌ను ఓడిస్తేనే పేదల కష్టాలు తీరతాయన్న ఈటల
నేను ఇచ్చే వాడిని మీరు పుచ్చుకునే వారని కేసీఆర్ భావిస్తున్నారని… నేను ఉండగా మిగిలిన పార్టీలు ఎందుకని భావిస్తున్నారని… చచ్చేదాక ముఖ్యమంత్రిగా ఉంటా, నా తరువాత కొడుకు, ఆ తరువాత మనుమడు ఉంటాడు అని కేసీఆర్ భావిస్తున్నాడని విమర్శించారు బీజేపీ సీనియర్ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. రాష్ట్రంలో గ్రామ గ్రామాన మెడికల్ షాపులు లేవు కానీ బెల్ట్ షాప్స్ ఏర్పాటు చేస్తున్నారని మండిపడ్డారు. పటాన్చెరు నియోజకవర్గంలో గుమ్మడిదల మండలంలో బీజేపీలో చేరికల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్. నందీశ్వర గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలు పార్టీల కార్యకర్తలు నందీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు.

ప్రజలను తాగుబోతులను చేసి సంపాదించడం దారుణమన్నారు. తాగుడికి డబ్బులు ఇవ్వలేదు అని అమ్మను, తాగిన మైకంలో తండ్రులను చంపిన సంఘటనలు పెరుగుతున్నాయని… ఎంతో మంది ఆడ బిడ్డల మంగళ సూత్రాలు తెగి పిల్లలు అనాధలుగా మారుతున్నారని ఈటల ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ఇస్తున్న.. కళ్యాణ లక్ష్మి 1500 కోట్లు, పెన్షన్ 9000 కోట్లు , రైతు బంధు 12000 కోట్లు మొత్తం కలిపిన 20 నుండి 25 వేల కోట్లే గానీ… మద్యం మీద మాత్రం ఏడాదికి 42 వేల కోట్లు వస్తున్నాయన్నారు. కేసీఆర్ ప్రజలకు పైసలిస్తున్నాడా… ప్రజలే కేసీఆర్‌కు ఇస్తున్నాడన్నది అర్థం చేసుకోవాలన్నారు. ఎవరి మీద ఎవరు బతుకుతున్నారో అర్థం చేసుకోవాలన్నారు ఈటల. ఓటు ఎంతో విలువ అయినదని… దాని శక్తి ఏంటో తెలుసుకోవాలన్నారు.

రాష్ట్రంలో వైద్యం ఖర్చులు భరించలేక.. ప్రాణాలు కాపాడండని… పేదలు పుస్తెలు కాళ్ల మీద వేసి ప్రాధేయపడుతున్నారని… వైద్య ఖర్చులు భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని… ఈ పాపం కేసీఆర్‌ది కాదా అని ఈటల ప్రశ్నించారు. అన్ని సబ్సిడీ లు ఎత్తి వేశారని… ఇన్సూరెన్స్ తీసేశారని… కేవలం రైతు బంధు ఇచ్చి అన్ని బంద్ పెట్టారన్నారు. రైతులు పండిన పంటను అమ్ముకొలేక పోతున్నారని.. పెద్దలకు రైతు బంధు ఎందుకని ప్రశ్నించారు ఈటల. ఫామ్ హౌజ్‌లకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు రైతు బంధు ఇస్తున్నారని ఇది దారుణమన్నారు. గరీబోల్ల కళ్ళల్లో మట్టి కొట్టి… బెంజ్ కార్ల వారికి పెడుతుంటే… వద్దని చెప్పడం తప్పా అని ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌలు రైతులకు రైతు బంధు ఎందుకు ఇవ్వవని ప్రశ్నించారు ఈటల.

సచివాలయానికి అంబేద్కర్ పేరు వెనుక మతలబేంటో చెప్పారు ఈటల. పేరు పెట్టగానే ఆకలి తీరుతుంది ? బతుకులు మారతాయా? కేసీఆర్‌కు ఎన్నికలప్పుడు మాత్రమే అంబేద్కర్ గుర్తు వస్తారని ఎద్దేవా చేశారు. ఎన్నికలు వస్తేనే గిరిజన రిజర్వేషన్ గుర్తుకు వస్తుందని.. ఎన్నికలప్పుడు మాత్రమే పోడు భూములు గుర్తుకువస్తాయని… అంబేద్కర్ పేరు పెట్టడం కాదని… పవర్ ఇవ్వాలని ఈటల డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలో ఉన్న దళిత బిడ్డలారా ఆలోచించాలని ఈటల పిలుపునిచ్చారు.

పేద ప్రజల మీద కేసీఆర్‌కు ద్వేషం ఉందని… అందుకే ధరణి తీసుకొచ్చి… రైతుల కళ్లల్లో మట్టికొట్టారన్నారు. ధరణి వల్ల 15 లక్షల మంది పేద రైతులు గిల గిల కొట్టుకుంటున్నారని… కోర్టు మెట్లు ఎక్కే సత్తా మన పేద రైతుకి ఉందా అని ఆక్షేపించారు ఈటల. అరచాకలకు కారణం కేసీఆరేనన్నారు. అన్నలు పంచిన భూములను… ప్రభుత్వం పంచిన భూములను మళ్లీ లాక్కుంటున్నారన్నారు. దళితులకు 3 ఎకరాలు ఇస్తా అని ఇవ్వలేదని… కొండ నాలుకాకు మందు వేస్తే ఉన్న నాలుక పోయినట్టుగా కేసీఆర్ బ్రోకర్ లా మారిపోయారన్నారు.