Andhra PradeshNews

కదం తొక్కుతున్న తెలుగుదేశం శ్రేణులు

◆ వినూత్న కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ వైఫల్యాలపై టీడీపీ విస్తృత ప్రచారం
◆ ఏపీ వ్యాప్తంగా “ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం”
◆ ప్రజల నుంచి విశేష స్పందన

ఏపీలో ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు అనేది విశ్లేషకుల మాట. కానీ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికలు ముందే వస్తాయని ఒక అంచనాకు వచ్చి ఎలా అయినా అధికార పీఠం కైవసం చేసుకోవాలని ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. రాజకీయాల్లో రాటు తేలిన చంద్రబాబు నాయుడిని వైసీపీ అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా తక్కువ అంచనా వేయటం లేదని తాడేపల్లి క్యాంపు కార్యాలయ వర్గాల ద్వారా తెలిసింది. చంద్రబాబు నాయుడుకున్న అపారమైన రాజకీయ అనుభవంతో చాప కింద నీరు లాగా ఒకవైపు పార్టీని పటిష్ట పరుస్తూ నియోజకవర్గ ఇన్చార్జిలతో నిత్యం మాట్లాడుతూ వినూత్న కార్యక్రమాల ద్వారా అతి తక్కువ సమయంలో ప్రజల్లోకి ఎలా చేరువవ్వాలి అనే అంశాలపై కసరత్తులు చేసి ఆ దిశగా పార్టీ కార్యకర్తలకు నేతలకు పిలుపునిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల ఆలోచనలల్లో మార్పు తెచ్చేలా రాష్ట్రంలో మూలన పడిన అభివృద్ధి పనులను ఎత్తిచూపుతూ ఇదేం ఖర్మ ఈ రాష్ట్రానికి అనే కార్యక్రమానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారు.

పన్నులు, చార్జీల పెంపుపై టీడీపీ చేపట్టిన బాదుడే బాదుడు కార్యక్రమం సక్సెస్ అవటంతో దాని స్ఫూర్తితో ఇదేం ఖర్మ రాష్ట్రానికి అంటూ చంద్రబాబు తాజాగా చేపట్టిన కార్యక్రమం ప్రజల్లోకి బలంగా వెళ్తుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అపూర్వ స్పందన లభిస్తోంది. ప్రాంతాలు కులాలు మతాలు రాజకీయాలకతీతంగా ప్రజలు తమ అభిప్రాయాలను టీడీపీ నేతలకు వివరిస్తున్నారు. దీంతో తెలుగుదేశం శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తుంది. ర్యాలీలు ఆందోళనలు ఇంటింటా కరపత్రాలను పంచుతూ తెలుగు తమ్ముళ్లు గర్జిస్తున్నారు. ప్రజల ఆలోచనలో మార్పు తెచ్చేలా వారికి ప్రభుత్వ వైఫల్యాలపై వివరిస్తున్నారు. ఎన్నికల సమీపిస్తున్న వేళ చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నియోజకవర్గ బాధ్యులు మాజీ ఎమ్మెల్యేలకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వటంతో ఆ పార్టీ శ్రేణులు అనుబంద విభాగాలు ప్రత్యేక వ్యూహాలను రూపొందించుకొని ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇప్పటికే అధికార పార్టీ చేపట్టిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పై ప్రజల నుంచి కొంతమేర కొన్నిచోట్ల నిరసన వెళ్లువెత్తుతున్న నేపథ్యంలో టీడీపీ చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమానికి ప్రజలు ఆహ్వానాలు స్వాగతాలు పలకటంతో ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. ముఖ్యంగా తటస్తులు చదువుకున్న వారు టీడీపీ నేతలను కలుసుకొని తమ సమస్యలను విన్నవిస్తున్నారు.

నాయకులు ఇంటింటికి వెళ్తున్నప్పుడు ప్రజలందరూ ముక్తకంఠంతో నాటి చంద్రబాబు పాలనను… అప్పుడు జరిగిన అభివృద్ధి పనులను గుర్తు చేసుకుంటూ హారతులు కూడా పడుతున్నారు. ఒకవైపు పార్టీని పటిష్ట పరుస్తూ నిద్రవస్థలో ఉన్న తెలుగుదేశం శ్రేణులను ప్రజల్లోకి పంపుతూ చంద్రబాబు ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు. దీంతోపాటు జనవరిలో చంద్రబాబు తనయుడు నారా లోకేష్ చేపట్టబోతున్న పాదయాత్ర ద్వారా తెలుగుదేశం పార్టీకి మరింత మైలేజ్ పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. రానున్న ఎన్నికలలో ఏదో ఒక పార్టీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్న ఎలాంటి ఇబ్బందులు లేకుండా అసెంబ్లీ స్థానాలు కేటాయించేలాగా కసరత్తులు కూడా చేస్తున్నారని ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఏది ఏమైనాప్పటికీ చంద్రబాబు తన రాజకీయ చాణిక్యంతో అధికారపక్షం తప్పులను ఎత్తిచూపుతూ ప్రజల ఆలోచనలు మారే విధంగా చేస్తున్నారు. ఎన్నికల నాటికి చంద్రబాబు మరింత దూకుడు పెంచి అధికార పక్షానికి మంచి ఫైట్ ఇవ్వబోతున్నారని అందరూ అనుకుంటున్నారు. మరి రానున్న ఎన్నికల్లో చంద్రబాబు తాను అనుకున్నది సాధిస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది.