Andhra Pradesh

చదువే పేదవారికి వెలుగు : సీఎం జగన్

◆విద్యా రంగంలో సమూల మార్పులు
◆గత ప్రభుత్వ బకాయిలు చెల్లింపు
◆మదనపల్లె నియోజకవర్గ అభివృద్ధికి నిధులు

ఆర్థికస్తోమత లేక ఏ విద్యార్థి ఉన్నత చదువులకు దూరం కాకూడదని సీఎం జగన్ అన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో నిర్వహించిన కార్యక్రమంలో జగనన్న విద్యాదీవెన పథకం కింద విద్యార్థులకు జూలై–సెప్టెంబర్ త్రైమాసికం నిధులను సీఎం వైయస్ జగన్ బుధవారం విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో సీఎం వైయస్ జగన్ మాట్లాడుతూ బటన్ నొక్కి నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.694 కోట్లు జమ చేస్తున్నామని, దీని ద్వారా మొత్తం 11.02 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుందని అన్నారు. పిల్లలకు మనం ఇవ్వగలిగిన ఆస్తి ఏదైనా ఉంది అంటే అది చదువు మాత్రమేనని పేదరికన్నీ తరిమికొట్టాలంటే ఒక్క చదువుతోనే సాధ్యమైవుతుందని పేర్కొన్నారు. అప్పట్లో పేదరకం చదువులకు అడ్డంకిగా ఉండకూడదని దివంగత నేత రాజశేఖర్ రెడ్డి పిల్లల చదువు కోసం ఫీజ్ రియింబర్స్ మెంట్ పథకం తీసుకొచ్చారని అన్నారు. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఈ పథకాన్ని నీరు గారిచ్చాయన్నారు. పాదయాత్రలో విద్యార్థులు ఫీజులు చెల్లించుకోలేక వారు పడుతున్న కష్టాలను నేరుగా చూసాను. అధికారంలోకి రాగానే జగనన్న విద్యా దీవెన పథకం కింద పూర్తి ఫీజ్ రీయింబర్స్ మెంట్ తీసుకువస్తానని హామీ ఇచ్చానన్నారు. విద్యా దీవెనతో పాటు వసతి దీవెన కూడా అందిస్తున్నామన్నారు.

గత ప్రభుత్వ బకాయిలు చెల్లింపు
గత ప్రభుత్వం హయాంలో 2017 నుంచి పెట్టిన బకాయిలు దాదాపు రూ.1,778 కోట్లతో కలిపి జగనన్న విద్యా దీవెన కింద రూ.9,052 కోట్లు, జగనన్న వసతి దీవెన కింద రూ. 3,349 కోట్లు వైయస్ఆర్సీపీ ప్రభుత్వం అందించిందన్నారు. ఈ నిధులతో కలిపి ఇప్పటివరకు ఈ రెండు పథకాల కింద రూ.12,401 కోట్లు సాయాన్ని ప్రభుత్వం అందించిందని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి బిడ్డా కూడా పోటీ ప్రపంచంలో నిలవాలని విద్యా వ్యవస్థలోనే సంస్కరణలు తీసుకువచ్చామన్నారు. పిల్లలకు చదువుపై పెడుతున్నా ఖర్చు ఖర్చుగా కాకుండా ఆస్తిగా భావించాలని తల్లిదండ్రులను సీఎం జగన్ కోరారు. సంస్కరణల్లో భాగంగా మార్పులు తీసుకువచ్చే దిశగా అడుగులు వేస్తూ కాలేజీల్లో జవాబుదారితనం పెరిగేలా, వసతులపై ఆ కాలేజీల యాజమాన్యాలను ప్రశ్నిస్తూ, వసతులను పర్యవేక్షించేలా నేరుగా ఆ డబ్బులు పిల్లల తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు. పిల్లలు ఎలా చదువుతున్నారో విచారణ చేసి ఆ డబ్బును కాలేజీల్లో చెల్లించండన్నారు.

విద్యా రంగంలో సమూల మార్పులు
పిల్లల చదువుల విషయంలో సంస్కరణలు తీసుకువస్తూ వైయస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా కానుక, మన బడి నాడు–నేడు, సీబీఎస్‌ఈ సిలబస్, బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, బైజూస్‌ సంస్థతో ఒప్పందం, 8వ తరగతి పిల్లలకు ట్యాబ్స్, డిజిటల్‌ క్లాస్‌ రూమ్స్, పెద్ద చదువుల కోసం పిల్లలు ఇబ్బంది పడకూడదని జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, ఉన్నత విద్యరంగంలో కరిక్యూలమ్‌ మార్పు చేశామన్నారు. డిగ్రీ చదివే సమయంలో ఇంటర్న్‌షిప్స్‌తీసుకువచ్చామన్నారు. ఆన్‌లైన్‌ వర్టికల్స్‌ విత్‌ క్రెడిట్‌ తీసుకువచ్చామని చెప్పారు. ఆన్‌లైన్‌లో ఉన్న మంచి కోర్స్‌లు వెతికి పట్టుకుంటున్నామన్నారు. వాటిని కూడా మన పిల్లలకు నేర్పించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. మైక్రోసాప్ట్, ఆమెజాన్‌ ఇలాంటి సంస్థలతో సర్టిఫైడ్‌ స్కిల్స్‌ కోర్సులు తీసుకువచ్చామని తెలిపారు. విద్యారంగాన్ని ఉపాధికి చేరువగా తీసుకెళ్తున్నామన్నారు. కేవలం ఈ మూడున్నరేళ్ల పాలనలోనే ఇన్ని పథకాలు తీసుకువచ్చి… రాష్ట్రంలో పిల్లలందరి భవిష్యత్‌ పట్ల మన ప్రభుత్వం తీసుకున్న బాధ్యత కనిపిస్తోందన్నారు. ఈ పథకాలపై ఇప్పటి వరకు రూ.55 వేల కోట్లు ఖర్చు చేశామని సగర్వంగా తెలిపారు. ఏటా 3 లక్షల పిల్లలు డిగ్రీ పట్టాలు అందుకుంటే అందులో కేవలం 37 వేల మందికి మాత్రమే క్యాంపస్‌ రిక్రూమెంట్‌ ద్వారా ఉద్యోగాలు పొందినట్లు గత ప్రభుత్వంలో చూశామన్నారు.. ఈ రోజు మన ప్రభుత్వంలో గత సంవత్సరం అక్షరాల క్యాంపస్‌ ప్లెస్‌మెంట్‌ ద్వారా 85 వేల మందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు.

ప్రతిపక్షాలపై వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు

ప్రసంగం ముగించే ముందు ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు సంబంధించి రెండు మాటలు చెబుతానన్నారు జగన్.. అక్షరాలు రాయడం, చదవడం మాత్రమే విద్యకు పరమార్ధం కాదని…. తనకు తానుగా ప్రతి పాప, ప్రతిబాబు ఆలోచించి నిర్ణయాలు తీసుకునే శక్తిని ఇవ్వగలుగడమే విద్యకు పరమార్థమని ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బల్ట్‌ ఐనిస్టిన్‌ చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ రోజు రాజకీయ విషయాల్లోకి వస్తే ఈ రోజు కొరబడిన అలాంటి ఆలోచన శక్తి, కొరవడిన వివేకం ప్రతిపక్షాలకు ఎప్పటికైనా రావాలన్నారు. పేదల పిల్లలు ఇంగ్లీష్‌ మీడియం చదవకూడదని కోరుకుంటున్న ప్రతిపక్షాల వైఖరి మారాలని ఆ దేవుడిని కోరుకుంటున్నా. నా వారు మాత్రమే బాగుపడాలని కోరుకునే మనస్తత్వం నుంచి మనుషులంతా ఒక్కటే అన్న జ్ఞానం వీరందరికీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు. ఈ రోజు ప్రతిపక్షాలు ఎలా ఉన్నాయంటే ఫలాన ప్రాంతంలో, ఫలాన పొలాలను ఫలానా రేటుకు అమ్ముకునేందుకు , ఆ భూముల్లోనే రాజధాని కట్టాలనే ఆలోచన నుంచి వీళ్లందరూ కూడా బయట పడేలా వీరికి ఆ దేవుడు జ్ఞానాన్ని, బుద్ధిని పంచిపెట్టాలని దేవుడిని కోరుకునే పరిస్థితి ఉంది. ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇస్తే సామాజిక సమతూల్యం దెబ్బతింటుందని వాదించే మెదళ్లను మార్చాలని, వీరికి మంచి ఆలోచనలు రావాలని దేవుడిని కోరుకుంటున్నానని చెప్పారు.

మదనపల్లె నియోజకవర్గ అభివృద్ధికి నిధులు
స్థానిక ఎమ్మెల్యే నవాజ్ కోరిక మేరకు మదనపల్లిలో టిప్పుసుల్తాన్ మసీద్ కోసం 5 కోట్లు, సీసీ రోడ్లు, డ్రైనేజీల కోసం 30 కోట్లు, మూడు బ్రిడ్జిల కోసం 14 కోట్లు,బహుదా నది బ్రిడ్జి కోసం 7.30 కోట్లు మదనపల్లె నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులను విడుదల చేస్తున్నట్టు సీఎం జగన్ తెలిపారు.