NationalNews

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో మళ్లీ ఈడీ సోదాలు

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దాడుల ఉధృతిని పెంచింది. శుక్రవారం హైదరాబాద్‌, ఢిల్లీ, బెంగళూరు, ముంబై, చండీగఢ్‌ సహా వివిధ రాష్ట్రాల్లోని 35 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఈ కేసులో అరెస్టు చేసిన వినయ్‌ నాయర్‌, సమీర్‌ మహేంద్రు ఇచ్చిన సమాచారం మేరకు ఈ దాడులు నిర్వహించినట్లు ఈడీ అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌, కూకట్‌పల్లి, మాదాపూర్‌, జూబ్లీహిల్స్‌లో నాలుగు బృందాలు సోదాలు జరిపాయి.

అరుణ్‌ రామచంద్రపిళ్లై, గండ్ర ప్రేమ్‌సాగర్‌, అభిషేక్‌ రెడ్డిలకు చెందిన కంపెనీల్లో సోదాలు జరిగాయి. హైదరాబాద్‌లోని ఆంధ్రప్రభ కార్యాలయంలోనూ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ మీడియా గ్రూప్‌కు పంజాబ్‌లోని ఆప్‌ ప్రభుత్వం రూ.20 కోట్లు హవాలా రూపంలో బదిలీ చేసినట్లు అధికారులకు సమాచారం అందింది. ఈ డబ్బును ఆంధ్రప్రభలో పెట్టుబడిగా పెట్టిన అభిషేక్‌ రెడ్డికి సీఎం కేసీఆర్‌ కుమార్తె కవితతో మంచి పరిచయాలు ఉన్నాయని తెలుస్తోంది. తెలంగాణాలోని 12 మందికి, 18 కంపెనీలకు ఈడీ అధికారులు నోటీసులు కూడా ఇచ్చారు. ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో ఈడీ సోదాలు జరపడం ఇది నాలుగోసారి.