నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు
ఇంటర్నెట్ డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్ ఇంకా కోలుకోలేదు. ఈ సోమవారం కూడా నష్టాల్లో ముగిసింది. కొత్త హెచ్1బీ వీసా దరఖాస్తుల రుసుము పెంచాలన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయంతో ఐటీ షేర్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. సెన్సెక్స్ 460 పాయింట్లు తగ్గగా.. నిఫ్టీ 64 పాయింట్ల మేర క్షీణించింది. ఉదయం 82,151.07 వద్ద ప్రారంభమయిన సూచీ రోజంతా నష్టాల్లోనే కదలాడింది. ఒక దశలో 81,997.29 పాయింట్ల కనిష్ఠానికి చేరిన సెన్సెక్స్ చివరకు 466.26 పాయింట్లు క్షీణించి చివరకు 82,159.97 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ 64.90 పాయింట్లు తగ్గి 25,262.15కి దిగొచ్చింది. ఇక రూపాయి మారకం విలువ డాలరుతో పొలిస్తే 15 పైసలు తగ్గి 88.31 వద్ద ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో అదానీ ఎంటర్‌ప్రైజెస్, ఎటెర్నల్, బజాజ్ ఆటో, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. ఇన్ఫోసిస్, టెక్‌మహీంద్రా, టీసీఎస్, సిప్లా, విప్రో వంటి ఐటీ కంపెనీల షేర్లు నష్టాల్లో ముగిశాయి.