InternationalNews

‘మీడియా’ను కమ్మేస్తున్న డిజిటల్‌ మీడియా

‘కేబుల్‌ బ్రిడ్జి కూలి 140 మంది మృతి’.. గుజరాత్‌లో జరిగిన ఈ ఘటన సమాచారం మన మొబైల్‌ ఫోన్‌కు క్షణాల వ్యవధిలోనే వచ్చేసింది. ఆ ఘటనకు సంబంధించి న్యూస్‌ యాప్‌లో సంక్షిప్త సమాచారాన్ని అప్పుడే చదివేస్తాం. అక్కడి పరిస్థితికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్‌ మీడియాలో.. డిజిటల్‌ మీడియాలో నిమిషాల్లోనే ప్రత్యక్షమవుతున్నాయి. సోషల్‌ మీడియాలో వచ్చిన వీడియోలకు తాజా సమాచారాన్ని జోడించి కొంతసేపటి తర్వాత టెలివిజన్‌ న్యూస్‌ చానెల్స్‌లో ప్రసారం చేస్తూ.. లైవ్‌ టెలికాస్ట్‌లు ఇస్తున్నాయి. ఇదే వార్త మరుసటి రోజు పత్రికల్లో బ్యానర్‌గా కనిపిస్తుంది. అప్పటికే పాతబడిన ఆ వార్తను ప్రజలు ఇక పత్రికల్లో ఎందుకు చూస్తారు..? మొత్తానికి వార్తా పత్రికలను న్యూస్‌ చానెళ్లు.. న్యూస్‌ చానెళ్లను డిజిటల్‌ మీడియా కబళించేశాయి.

ఒక్క రోజులోనే ఎన్నో మలుపులు..

‘చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ అరెస్టు.. ఆయనను ఎయిర్‌పోర్టు వద్దే చుట్టుముట్టిన సైన్యం’.. ఈ వార్త సోషల్‌ మీడియాలో రాగానే ప్రపంచమంతా హల్‌చల్‌ అయింది. వెంటనే జిన్‌పింగ్‌ను ఎవరు అరెస్టు చేశారు..? ఎందుకు చేశారు..? కొత్త అధ్యక్షుడు ఎవరు..? ఇలా వరుస కథనాలను ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ డిజిటల్‌ మీడియా సంస్థలు వండి వార్చాయి. అంతలోనే జిన్‌పింగ్‌ అరెస్టు వార్త నిజం కాదని.. అంతా వట్టిదేనని ఫ్యాక్ట్‌ చెక్‌ పేరుతో మరిన్ని కథనాలు ప్రత్యక్షమయ్యాయి. ఒక వార్త ఒక్క రోజులోనే ఇన్ని మలుపులు తిరగడానికి ప్రధాన కారణం ప్రజల చేతిలో ఉన్న స్మార్ట్‌ ఫోన్‌.. అందులో డిజిటల్‌ మీడియా వండి వార్చే కథనాలు.. బ్రేకింగ్‌ న్యూస్‌.. అలెర్ట్‌ సిగ్నల్‌ పేరుతో వచ్చే సంచలన వార్తలు.. ఇవన్నీ మరుసటి రోజు పత్రికల్లో ఓ సమగ్ర వార్త రూపంలో వస్తే చదివే ఓపిక ఎవరికి ఉంటుంది..?

అరచేతిలో డిజిటల్‌ విప్లవం..

రోజంతా తమ పనులతో బిజీగా గడిపే ప్రజలకు టీవీ ముందు కూర్చొని వార్తలు చూసే తీరికా ఉండటం లేదు. చేతుల్లోకి స్మార్ట్‌ ఫోన్లు రావడంతో ప్రపంచమంతా అరచేతిలో కనిపిస్తూ డిజిటల్‌ విప్లవమే వచ్చేసింది. వార్తలను తెలుసుకునే స్టయిల్‌ పూర్తిగా మారిపోయింది. ప్రయాణంలోనూ.. పని చేసుకుంటూ.. తింటూ.. నడుస్తూ.. నడుం వాలుస్తూ.. ఫ్రెండ్స్‌తో చిట్‌చాట్‌ చేస్తూ.. ఎప్పటికప్పుడు తాజా వార్తలు  తెలుసుకుంటున్నారు. వేగంగా.. పారదర్శకంగా.. ఉన్నది ఉన్నట్లు.. లైవ్‌ వీడియోలతో ప్రసారం చేస్తూ వార్తల స్వరూపాన్ని సోషల్‌ మీడియా, డిజిటల్‌ మీడియా పూర్తిగా మార్చేసింది. అందుకే ఈ రోజు బ్రేకింగ్‌ న్యూస్‌గా చూసిన వార్తను మరుసటి రోజు పత్రికల్లో చూసేందుకు ప్రజలు ఇష్టపడటం లేదు. పాచిపోయిన వార్తగా తేలిగ్గా తీసి పారేస్తున్నారు.

భవిష్యత్తు డిజిటల్‌ మీడియాదే..

ఫోర్త్‌ ఎస్టేట్‌గా పత్రికలు, న్యూస్‌ చానెల్స్‌ ఉన్నాయి. డిజిటల్‌ మీడియాను ప్రభుత్వాలు ఇంకా గుర్తించనే లేదు. అయినా.. పత్రికలు, న్యూస్‌ చానెల్స్‌ను డిజిటల్‌ మీడియా ఎప్పుడో వెనక్కి నెట్టేసి ప్రజల జీవితాల్లోకి దూసుకొచ్చేశాయి. ప్రభుత్వం కూడా సోషల్‌ మీడియాను గుర్తించాల్సిన పరిస్థితిని తీసుకొచ్చాయి. జర్నలిస్టులు, విలేకరులు కూడా ఇప్పుడు ప్రధాన స్రవంతి మీడియా అయిన ప్రింట్‌, న్యూస్‌ చానెల్స్‌ను వదిలేసి డిజిటల్‌ మీడియా, సోషల్‌ మీడియా వైపు మారిపోతున్నారు. ఇక భవిష్యత్తు అంతా డిజిటల్‌ మీడియాదే.