వైసీపీలో భగ్గుమంటున్న అసమ్మతి
◆ సిట్టింగ్ శాసనసభ్యుల అసమ్మతి రాగం
◆ ఒక్కో జిల్లా నుంచి బయటపడుతున్న విభేదాలు
◆ దిద్దుబాటు చర్యల దిశగా వైసీపీ అధినేత జగన్
◆ ఒక్కొక్కరితో క్యాంప్ కార్యాలయంలో సమావేశం
ఏ రాష్ట్రంలో అయిన అధికార పార్టీలో అసమ్మతి, వ్యతిరేకత ఉండటం అనేది సర్వసాధారణమైన విషయమే. అలానే ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీకి సిట్టింగ్ శాసనసభ్యుల ద్వారా అసమ్మతి పెరగటంతో అధిష్టానానికి తలనొప్పిగా మారింది. అసమ్మతి వాదుల సమస్యలు తెలుసుకొని పరిష్కరించటంలో మిగిలిన రాజకీయ పార్టీలతో పోలిస్తే వైసీపీ ఎప్పుడు ఒక అడుగు ముందే ఉన్న రోజురోజుకు ఆయా జిల్లాల నుండి అసమ్మతి వాదులు పెరిగిపోవటంతో దిద్దుబాటు చర్యలకు వైసీపీ అధిష్టానం శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయం దగ్గర పడే కొద్ది వైసీపీలో నేతల మధ్య నెలకొని ఉన్న అంతర్గత విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కొంతమంది ముఖ్య నేతలతో పాటు సిట్టింగ్ శాసనసభ్యులు తమ వాదనను బలంగా వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో వైసీపీ అధినేత వైయస్ జగన్ స్వయంగా రంగంలోకి దిగి రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లాల్లో నెలకొని ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అసమ్మతినేతలను పిలిపించి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించాలని యోచిస్తున్నట్లు తెలిసింది.

ఈ ప్రక్రియలో భాగంగానే సోమవారం నుంచి ఆయా జిల్లాల వారీగా అసమ్మతినేతలతో సమావేశం అవుతున్నట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇప్పటికే నెల్లూరు గ్రామీణ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పిలిపించి మాట్లాడిన జగన్ ఇదే తరహాలో మిగిలిన శాసనసభ్యులతో కూడా సమావేశమై స్థానికంగా ఉన్న వారి సమస్యలను పరిష్కరించే దిశగా నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నెల్లూరు జిల్లాతో పాటు గుంటూరు, కృష్ణా , కర్నూలు జిల్లాలో కొంతమంది ఎమ్మెల్యేల్లో అసంతృప్తి వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. వారంతా ఇటీవల కాలంలో అధికారులు, ప్రభుత్వ తీరుపై ప్రత్యక్షంగా పరోక్షంగా విమర్శలు చేస్తూ వస్తున్నారు. దీంతో వీరిపై జగన్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. పార్టీ కోసం ఇన్ని సంవత్సరాలు కష్టపడి పనిచేసిన నేతలను దూరం చేసుకోవడం మంచిది కాదన్న ఆలోచనతో ప్రతి ఒక్కరిని పిలిపించి మాట్లాడి అక్కున చేర్చుకునే కార్యక్రమం జగన్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియలో భాగంగా ఆయా జిల్లాల్లో జరిగిన జరుగుతున్న పొరపాట్లను సరిదిద్దేల జగన్ రంగంలోకి దిగబోతున్నారు. నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అధికారుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన తర్వాత సీఎం జగన్ స్వయంగా లేఖ ఇచ్చిన ఉన్నతాధికారులు పట్టించుకోలేదంటూ సమావేశంలో ఆయన ఆవేదన వ్యక్తం చేయటంతో విషయం తెలుసుకున్న జగన్ గతవారం ఆయనను స్వయంగా తాడేపల్లికి పిలిపించి భేటీ అయ్యారు.

నియోజకవర్గ పరిధిలో ఉన్న సమస్యలను తెలుసుకొని అవసరమైన నిధులను వెంటనే విడుదల చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. దీంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమస్య పరిష్కారమైంది స్థానిక ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తిరిగి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని యధావిధిగా కొనసాగిస్తున్నారు. ఇదే తరహాలో కర్నూలు జిల్లా నందికొట్కూరు, గుంటూరు జిల్లా ప్రత్తిపాడు, కృష్ణాజిల్లా మైలవరం, నెల్లూరు జిల్లా వెంకటగిరి తదితర నియోజకవర్గాల్లో నెలకొని ఉన్న రాజకీయ పరిస్థితులపై చర్చించి సమస్యలు పరిష్కరించే సీఎం జగన్ నిర్ణయం తీసుకోబోతున్నారట. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లా నందికొట్కూరుకు చెందిన నేతలతో తొలి సమావేశం సోమవారం జరగబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇదే సందర్భంలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వంపై సంచల వ్యాఖ్యలు చేసిన వెంకటగిరి శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డికి పిలుపు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని అంటున్నారు. అసమ్మతివాదులపై సీఎం జగన్ స్వయంగా దృష్టి కేంద్రీకరించడంతో వారి సమస్యలు పరిష్కారమవుతాయా లేదా చూడాల్సి ఉంది.