‘ఆమెకు దయ్యం కానీ పట్టిందా’..సీనియర్ హీరోయిన్ ఫైర్
తమ కుటుంబ వ్యవహారంపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో మండిపడ్డారు సీనియర్ హీరోయిన్ అమల. మంత్రి కొండా సురేఖ దయ్యం పట్టినట్లు మాట్లాడారని ఫైర్ అయ్యారు. సమంతా, నాగచైతన్య విడాకులకు కారణం కేటీఆరే అని వ్యాఖ్యానించడంతో రాజకీయం కాస్త అల్లరిపాలయ్యింది. రాక్షసంగా మాట్లాడారంటూ మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు అమల. తన భర్త నాగార్జున, తన కుటుంబంపై కొండా సురేఖ అసత్య ప్రచారాలు, అడ్డగోలు వ్యాఖ్యలు చేయడంపై సీరియస్ అయ్యారు. రాహుల్ గాంధీ మీ మంత్రులను అదుపులో ఉంచుకోండంటూ తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయ పరమైన అవసరాల కోసం మహిళలను, సినీ ప్రముఖులను వాడుకుంటారా అని ప్రశ్నించారు. నాగార్జున కూడా ఈ విషయంపై మండిపడ్డారు. రాజకీయాల కోసం అబద్దాలు ప్రచారం చేయవద్దని హితవు చెప్పారు. ఈ విషయంపై నాగచైతన్య కూడా స్పందించారు. ఈ విడాకులు పరస్పర అంగీకారంతోనే జరిగాయని దీనిలో రాజకీయనాయకుల ప్రమేయాలు లేవని స్పష్టం చేశారు. కొండా సురేఖ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని పేర్కొన్నారు. సమంతా కూడా కొండా సురేఖ వ్యాఖ్యలపై మండిపడ్డారు. తనను రాజకీయాలలోకి లాగవద్దని, సినీనటిగా తాను ఎంతో సంతోషంగా ఉన్నానని, సినీ నటి అయినందుకు గర్వపడుతున్నానని పేర్కొన్నారు. అలాగే పలువురు సినీ ప్రముఖులు ఆమె వ్యాఖ్యలను ఖండించారు. బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సీనియర్ యాక్టర్ ప్రకాశ్ రాజ్ సిగ్గులేని రాజకీయాలని, సినిమాలలో నటించే ఆడవారంటే అంత చులకనా? అని ప్రశ్నించారు. హీరోనాని, సీనియర్ హీరోయిన్ ఖుష్భూ, జూనియర్ ఎన్టీఆర్, సీనియర్ హీరోయిన్ రోజా వంటి పలువురు ఆమె వ్యాఖ్యలను ఖండించారు.