అప్పటి వరకు ఒక లెక్క.. కోహ్లీ మెసేజ్ చేశాక మరో లెక్క
టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ స్ట్రెయిడ్ ఫార్వార్డ్నెస్ ఎవరికైనా నచ్చుతుంది. ఆయన ఆటలోనూ, బయట కూడా వ్యవహరించే తీరు కొంచెం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. టీమ్ ఇండియాలో ధోనీ చాటున వచ్చి అద్భుత విజయాలు దక్కించుకొని నెంబర్ 1 స్థానానికి ఎగబాకాడు. క్రికెట్ ప్రపంచంలో తనంత క్రేజ్ మరెవరికీ లేదంటే అది అతిశయోక్తి కాదు. అలాంటి కోహ్లీ గత ఏడాదిగా ఫామ్ కోల్పోయి జట్టులో స్థానం ఉంటుందా.. ఉండదా అన్న సంశయాల నడము ఆసియా కప్ లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. పాత జ్ఞాపకాల గురించి కోహ్లీ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. పాకిస్తాన్ మ్యాచ్ ఓటమి తర్వాత కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. టెస్ట్ కెప్టెన్సీని వదిలేశాక… తనను సంప్రదించింది ఒక్క ధోనీ మాత్రమేనన్నాడు.

కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పుకున్నాక ధోనీ పంపించిన సందేశం ఎంతో ధైర్యాన్నిచ్చిందన్నాడు. ఫామ్ కోల్పోయి విమర్శలు ఎదుర్కొంటున్న కోహ్లీ ఈ సీరిస్లో ఆడిన మూడు మ్యాచ్లలో మొత్తం 154 పరుగులు చేశాడు. థ్రిల్లర్లో జరిగిన పోటీలో టీమ్ ఇండియా ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయినా తిరిగి పుంజుకుంటుందంటూ వ్యాఖ్యానించాడు. టెస్ట్ కెప్టెన్సీ నుండి వైదొలిగినప్పుడు, ఒకే వ్యక్తి నుండి మాత్రమే సందేశం వచ్చిందని… ఆ వ్యక్తితో క్రికెట్ సుదీర్ఘకాలం ఆడానన్నాడు. ఆయనే MS ధోని అని చెప్పుకొచ్చాడు కోహ్లీ. ధోనీ తప్ప మరెవరూ కూడా మెసేజ్ చేయలేదన్న కోహ్లీ… తన నెంబర్ చాలా మంది దగ్గర ఉందన్నాడు. చాలా మంది టీవీలో నాకు సలహాలు ఇచ్చారని… అలాంటి వాళ్ల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదంటూ భారత్ జట్టు మాజీ కెప్టెన్ ధోనీని కోహ్లీ ఆకాశానికి ఎత్తేశాడు. దేవుడు ప్రతిదీ ఇస్తాడు, దేవుడు మాత్రమే విజయం సాధించడంలో సహాయం చేస్తాడు. గెలుపు ఓటములన్నీ ఆయన చేతిలోనే ఉన్నాయన్నాడు కోహ్లీ.

