Home Page SliderNationalSpiritualTrending Today

ధర్మాచరణమే ‘ధనుర్మాసం’ ప్రత్యేకత..

నేటి (డిసెంబర్ 16 ) నుండి హిందువులకు ఎంత పవిత్రమాసమైన ‘ధనుర్మాసం’ ప్రారంభమయ్యింది. మార్గశిర మాసంలో పౌర్ణమి తర్వాత పాడ్యమి నుండి శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన ఈ ధనుర్మాసం ధర్మాచరణానికి ఎంతో ప్రాముఖ్యం సంతరించుకుంది. సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించి, మకరసంక్రాంతి వరకూ ఈ రాశిలో ఉంటాడు. సంక్రాంతి రోజున మకర రాశిలో ప్రవేశిస్తాడు. అందుకే దీనిని ధనుర్మాసం అని పిలుస్తారు. ఈ నెలరోజులు పుణ్యకార్యాలు చేస్తే ఎంతో మంచిది. తమిళులు, ద్రవిడ సంప్రదాయాన్ని పాటించేవారు ఈ నెలలో వైష్ణవ ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తిరుమల శ్రీవారి ఆలయంలో కూడా ఈ రోజు నుండి సుప్రభాత సేవ బదులుగా తిరుప్పావైని నిర్వహిస్తారు. ఈ నెలరోజులు భక్తిగా ‘తిరుప్పావై’ పారాయణ చేసి, భోగి పండుగ రోజు గోదా కళ్యాణం చేస్తారు. ఈ విధంగా చేస్తే శ్రీ మహావిష్ణువు ప్రీతి చెందుతారని పండితులు చెప్తుంటారు. పురాణాల ప్రకారం గోదాదేవి, శ్రీకృష్ణుని భర్తగా పొందడానికి చిన్నతనం నుండి ప్రతీ ధనుర్మాసంలో ఈ ‘తిరుప్పావై’ పాశురాలు రచించి, స్వయంగా పారాయణ చేసి భగవంతునిలో ఐక్యమయిందని చెప్తారు. అందుకే కన్యలు మంచి భర్తను కోరుకుంటూ తిరుప్పావై పాశురాలు ఈ నెల రోజులు పారాయణ చేస్తూంటారు.