26 వేల వజ్రాలతో “దేవ్ ముద్రిక” ఉంగరం
మనకి ఒక్క వజ్రంతో పొదిగిన ఉంగరం ఉంటేనే మనం ఎంతగానో మురిసిపోతుంటాము. అలాగే ఆ ఉంగరాన్ని ఎంతో అపురూపంగా చూసుకుంటాము. అలాంటిది దాదాపు 26,200 వజ్రాలతో పొదిగిన ఉంగరం అంటే..మామూలు విషయం కాదనే చెప్పాలి. ప్రపంచంలోనే అత్యధిక వజ్రాలతో పొదిగిన ఈ ఉంగరం మన దేశంలోనే తయారు చేయబడడం గమనార్హం. కాగా పువ్వు ఆకారంలో రూపుదిద్దుకున్న ఈ ఉంగరం చూపరులను ఎంతగానో ఆకర్షిస్తోంది.

అయితే ఈ ఉంగరాన్ని ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌కు చెందిన డాజ్లింగ్ జ్యూవెలరీ అనే ఆభరణాల సంస్థ తయారు చేసింది. అంతేకాకుండా ఈ ఉంగరానికి “దేవ్ ముద్రిక” అని నామకరణం చేశారు. ఈ సందర్భంగా ఉంగరాన్ని తయారు చేసిన ఆభరణాల సంస్థ యజమాని విపుల్ మీడియాతో మాట్లాడారు. గతంలో దాదాపు 24 వేల వజ్రాలతో పొదిగిన ఉంగరాన్ని దక్షిణాదికి చెందిన ఆభరణాల సంస్థ తయారు చేసిందన్నారు. ఈ దేవ్ ముద్రిక ఉంగరం డిజైన్‌ను మొదట సాఫ్ట్‌వేర్ ద్వారా రూపొందించామన్నారు. తర్వాత కళాకారులతో తయారు చేయించామని విపుల్ తెలిపారు. దాదాపు 8 నుంచి 10 మంది కళాకారులు 3 నెలలు పాటు కష్టపడి దీనిని ఎంతో అందంగా తయారు చేశారని ఆయన వెల్లడించారు. అయితే ఈ ఉంగరాన్ని రెండు వేళ్లకు ధరించవచ్చనన్నారు. కాగా ఈ ఉంగరానికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో చోటు కోసం దరఖాస్తు చేశామన్నారు. ఈ ఉంగరం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో స్థానం సంపాదించాక దీని ధరను నిర్ణయిస్తామని విపుల్ అగర్వాల్ పేర్కొన్నారు.