Home Page SliderTelangana

భర్త మృతి చెందిన ఆసుపత్రిలోనే భార్యకు డెలివరీ

రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా.. తర్వాత గంట సేపటికి అదే ఆస్పత్రిలో అతని భార్యకు డెలివరీ అయ్యింది. ఈ హృదయ విదారక ఘటన కర్నూల్ లో చోటు చేసుకున్నది. జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం తుమ్మలపల్లె గ్రామానికి చెందిన శివ సమీపంలోని పెట్రోల్ బంక్ లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే, అతని భార్య లక్ష్మి ప్రెగ్నెంట్ కావడంతో డెలివరీ కోసం ఇటీవల పుట్టింటికి వెళ్లింది. శివ రాజోలి వెళ్తుతుండగా బైక్ స్కిడ్ అయి పడిపోయాడు. అతని తలకు బలమైన గాయం తగిలి తీవ్ర రక్తస్రావం జరిగింది. గమనించిన స్థానికులు అంబులెన్స్ ను పిలిపించి శివను కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అదే రోజు శివ భార్య లక్ష్మికి కూడా పురిటి నొప్పులు వచ్చాయి. లక్ష్మి కుటుంబసభ్యులు కూడా ఆమెను అదే ఆస్పత్రికి తీసుకెళ్లారు. భర్త చికిత్స పొందుతూ మృతి చెందాడు. భర్త మృతి చెందిన గంట తర్వాత భార్య పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. మనుమడు పుట్టాడని సంతోషించాలో శివ చనిపోయాడని ఏడవాలో తెలీక అతని తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.