Andhra PradeshHome Page Slider

ఢిల్లీ పాలన బిల్లు ఓటింగ్‌.. మోడీకి మద్దతుగా జగన్

ఢిల్లీ పాలనను తమ కంట్రోల్‌లో ఉంచుకునేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన ఆర్డినెన్స్ రాజ్యసభలో పాస్ అయ్యేందుకు మార్గం సుగమం అయ్యింది. కేంద్రానికి లోక్ సభ, రాజ్యసభలో మద్దతిస్తామంటూ వైసీపీ తేల్చి చెప్పడంతో… రాజ్యసభలో బిల్లును కేంద్రం ఆమోదించుకునేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న అన్ని నిర్ణయాలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు పలుకుతూ వస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో 9 మంది సభ్యులు ఉండగా, లోక్ సభలో 22 మంది సభ్యులు ఉన్నారు. ఇప్పటికే కేంద్రం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన, ఢిల్లీ పాలన బిల్లుకు పూర్తి మద్దతు అందిస్తామని వైసీపీ స్పష్టం చేసింది. రాజ్యసభలో బీజేపీకి తగిన మద్దతు లేకపోవడంతో, కమలనాథులకు వైసీపీ సభ్యుల మద్దతు అత్యవసరమైంది. గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెర్రిటరీ ఆఫ్ ఢిల్లీ అమెండెమెంట్ బిల్లను కేంద్రం పార్లమెంట్‌లో ఆమెదించుకునేందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంది.

తాజా బిల్లు ద్వారా ఢిల్లీ పాలనను నిర్ణయించే, బ్యూరోక్రట్లు నియామకాలకు, బదిలీలకు సంబంధించి కీలక అధికారాలు కేంద్రం కనుసన్నల్లో ఉంటాయి. వాస్తవానికి కేంద్రం గతంలో తీసుకొచ్చిన బిల్లును సుప్రీంకోర్టు తప్పుబట్టడంతో కేంద్రం తాజాగా మరో కొత్త బిల్లును తీసుకొచ్చింది. కొత్త బిల్లు ద్వారా, దేశ రాజధాని ఢిల్లీలో అధికారుల బదిలీ, నియామకాలకు సంబంధించిన అధికారం, లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా కేంద్రం తన అదుపులో ఉంచుకుంటుంది. ఢిల్లీ బిల్లు విషయంలో, కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి ఇప్పటికే తేల్చి చెప్పారు. మణిపూర్ అంశానికి సంబంధించి లోక్ సభలో ఇండియా భాగస్వామ్యపక్షాల అవిశ్వాస తీర్మానంలో సైతం వైసీపీకి చెందిన 22 మంది లోక్ సభ సభ్యులు ప్రభుత్వానికి మద్దతుగా నిలవనున్నారు. అవిశ్వాస తీర్మానానికి సంబంధించి ఇప్పటికే స్పీకర్ నిర్ణయం తీసుకున్నందున దీనిపై త్వరలో ఓటింగ్ జరగనుంది. మణిపూర్ అంశానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన చేయాలని ఇండియా భాగస్వామ్య పక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

కేంద్రం తీసుకొచ్చిన కొత్త ఆర్డినెన్స్‌ను అడ్డుకునేందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ దేశవ్యాప్తంగా వివిధ పార్టీల అధినేతలతో సమావేశం అయ్యారు. ఈ నేపథ్యంలో ఇండియా భాగస్వామ్యపక్షాల కూటమి సమావేశం జరగడం… కూటమిలోకి ఆప్‌ను తీసుకొచ్చే అంశంలో, ఢిల్లీ బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తామని, కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం జరిగిపోయాయి. ఇప్పటివరకు ఉప్పు నిప్పులాగా ఉన్న కాంగ్రెస్ ఈ విషయంలో ఆప్‌కు మద్దతుగా నిలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఓవైపు కాంగ్రెస్ పార్టీ, ఢిల్లీ బిల్లు విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీకి పూర్తిస్థాయిలో మద్దతిస్తున్నప్పటికీ రాజ్యసభలో బిల్లు పాస్ అవడం వెనుక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాజ్యసభలో 238 సభ్యులు ఉండగా మెజార్టీ మార్క్ 120. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు రాజ్యసభలో 105 మంది ఎంపీల మద్దతు ఉంది. కేంద్రానికి ఐదుగురు నామినేటెడ్ సభ్యులతో పాటు ఇద్దరు స్వతంత్ర మద్దతు సైతం ఉంది. దీంతో ఎన్డీఏ పక్షాల బలం 112కి చేరుకొంది. రాజ్యసభలో కేంద్రానికి బిల్లు పాస్ చేసుకోడానికి మరో ఎనిమిది మంది సభ్యుల మద్దతు అవసరం ఉంది. వైసీపీకి ఉన్న తొమ్మిది మంది సభ్యుల మద్దతుతో బిల్లును రాజ్యసభలో పాస్ చేయించుకోవడం కేంద్రానికి ఈజీ అవుతుంది. రాజ్యసభలో విపక్షాలకు 105 మంది సభ్యుల బలం ఉంది.