తెలంగాణ ప్రజలకు డిసెంబర్ 9 పండుగ రోజు..
తెలంగాణ రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో సీఎంతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. డిసెంబర్ 9న నూతన తెలంగాణ తల్లి విగ్రహాం ఆవిష్కరించనున్నారు. ప్రస్తుతం ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి మార్పులు చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. తెలంగాణ తల్లి విగ్రహా ఏర్పాటుకు భూమి పూజ చేయడం నా అదృష్టమని అన్నారు. డిసెంబర్ 9న తెలంగాణ ప్రజలకు పండుగ రోజు అని పిలుపు నిచ్చారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన మాటను సోనియా గాంధీ నిలబెట్టుకున్నారని గుర్తు చేశారు.

గత ప్రభుత్వం తెలంగాణ తల్లిని మరుగున పడేసి.. ప్రగతి భవన్ పేరుతో పెద్ద గడి నిర్మించుకున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం సెక్రటేరియట్ లోకి సామాన్యులకు రానివ్వలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రగతి భవన్ ను ప్రజాభవన్ గా మార్చి సామాన్యులకు అందుబాటులోకి తీసుకు వచ్చామన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన రాజీవ్ గాంధీ విగ్రహం సెక్రటేరియట్ ముందు ఏర్పాటు చేస్తుంటే.. దానిని కూడా వివాదం చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలపై సీరియస్ అయ్యారు.