బాంబుల తయారీ పరిశ్రమలో భారీ పేలుడు మూడుకు చేరిన మృతుల సంఖ్య
యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం కాటేపల్లిలో ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్ కంపెనీలో భారీ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య మూడుకు చేరింది. ఇప్పటికేఆత్మకూరుకు చెందిన కల్వల నరేశ్ (30) మృతిచెందగా.. బుధవారం కాటేపల్లికి చెందిన జి.సందీప్, మోటకొండూరు మండల కేంద్రానికి చెందిన సీహెచ్ దేవీచరణ్ చనిపోయినట్లు గుర్తించారు. శిథిలాల్లో చిక్కుకుని వీరిద్దరూ మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్స్‌లోని 18ఏ బ్లాక్ భవనంలో మంగళవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి భవనం కుప్పకూలి పోయింది. క్వారీల్లో వినియోగించే బాంబుల ముడిసరకును ఈ పరిశ్రమలో తయారు చేస్తారు. ఘటన సమయంలో భవనంలో మొత్తం తొమ్మిది మంది కార్మికులు పనిచేస్తున్నారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కల్వల నరేశ్‌ను హైదరాబాద్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. యాదగిరిగుట్ట మండలం కాచారం గ్రామానికి చెందిన బి.శ్రీకాంత్, పెద్దకందుకూరుకు చెందిన ఎస్.మహేందర్, వలిగొండ మండలం పులిగిల్లకు చెందిన బి.లింగస్వామి, మోటకొండూరు మండలం చాడ గ్రామానికి చెందిన ఆర్.శ్రీకాంత్‌లకు తీవ్ర గాయాలు కాగా.. హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనాస్థలిని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య పరిశీలించారు. మరోవైపు కంపెనీ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.