ఆకాశంలో కళ్లు మిరుమిట్లు గొలిపే వెలుగు-టెన్షన్‌లో ఉక్రెయిన్ ప్రజలు
ఆకాశంలో కళ్లు మిరుమిట్లు గొలిపే వెలుగును చూసి భయభ్రాంతులకు గురయ్యారు ఉక్రెయిన్ ప్రజలు. నిన్న రాత్రివేళ ఉక్రెయిన్ రాజధాని కీవ్ సమీపంలో భారీ ఫ్లాష్‌లైట్ కనిపించింది. అసలే రష్యా యుద్ధ భయంతో ఉన్న ప్రజలు అది రష్యా వైమానిక దాడిగా భావించి చాలా ఆందోళనకు గురయ్యారు. వైమానిక దాడులు జరగవచ్చని ముందే వారికి హెచ్చరికలు కూడా జారీ కావడంతో వారి టెన్షన్‌కు అంతులేకుండా పోయింది. అయితే కాలం చెల్లిన నాసాకు చెందిన ఉపగ్రహం భూవాతావరణంలో ప్రవేశించడం వల్లే ఇలా కనిపించిందని తర్వాత కీవ్ సైనిక పరిపాలన అధికారి తెలపడంతో కుదుటపడ్డారు. గత కొన్నిరోజులుగా ఈ ఉపగ్రహంపై వార్తలు వస్తూనే ఉన్నాయి. నిరుపయోగమైన ఈ ఉపగ్రహం భూమిదిశగా వస్తోందని, అయితే ఎవరికీ ప్రమాదం ఉండదని, భూమి వాతావరణంలో ప్రవేశించగానే కాలిపోతుందని నాసా ముందే ప్రకటించింది. అయితే కొన్ని గంటల ముందే ఆ వెలుగు నాసా సాటిలైట్ కాదని అది ఇంకా భూకక్ష్యలోనే పరిభ్రమిస్తోందని నాసా ప్రకటించింది. దీనితో ఆ వెలుగు ఎందుకు వచ్చిందో అంతుపట్టని రహస్యంగా మిగిలిపోయింది. కారణాలు తెలియాల్సి ఉంది.