Home Page SliderNational

రెండు గంటలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..పారాగ్లైడింగ్

పారాగ్లైడింగ్ ఇద్దరు సాహసికుల ప్రాణాల మీదకు తెచ్చింది. కేరళలో  వర్కళ బీచ్‌లో పారాగ్లైడింగ్ చేస్తూ బలమైన గాలులకు దారి తప్పి, ఎత్తయిన హైమాస్ట్ స్తంభానికి చిక్కుకుపోయారు ఇద్దరు పారాగ్లైడర్లు. తమిళనాడుకు చెందిన ఒక మహిళ ఈ బీచ్‌కు వచ్చి, పారాగ్లైడింగ్ చేయాలనుకుని, ఒక ప్రొఫెషనల్ పారాగ్లైడర్‌ను మాట్లాడుకుంది. వారిద్దరూ పారాషూట్ ద్వారా ఎగురుతున్నారు. అయితే ఉన్నట్లుండి గాలి దిశ మారింది. బలమైన గాలి వీచి వారి పారాషూట్ దిశను మార్చింది. దీనితో దూరంగా వెళ్లి, ఒక ఎత్తైన హైమాస్ట్ లైట్ పోల్‌కు చిక్కుకున్నారు. ఈ పోల్ దాదాపు 50 అడుగుల ఎత్తు ఉండడంతో వారు భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ రెండు గంటలు గడిపారు.  ప్యారాష్యూట్ తాళ్లకు వ్రేలాడుతూ స్తంభాన్ని పట్టుకుని ఉండిపోయారు. వీరిని గమనించిన స్థానికులు పోలీసులకు తెలియజేశారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది కూడా ఆ ప్రదేశానికి వచ్చి, వారికి రక్షించడానికి ప్రయత్నించారు. కింద పరుపు, వలలు ఏర్పాట్లు చేసి అతికష్టం మీద వారిని కిందికి దించారు. వారికి గాయాలు కావడంతో స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు.