అమెరికా విమానాలపై సైబర్ దాడి కావచ్చు
బుధవారం సాంకేతిక లోపాలతో అగ్రరాజ్యం అమెరికాలో అనేక విమానాలు ఆగిపోయిన సంగతి తెలిసిందే. అయితే సరైన కారణం ఏమిటో ఇప్పటికీ తెలియరాలేదు. దీనితో సైబర్ నేరగాళ్లు ఎవరైనా దీని వెనుక ఉన్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గత 20 ఏళ్లలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదని, విమానాలు ఎయిర్‌పోర్టులకే పరిమితమవ్వడం ఇదే తొలిసారని ఎఫ్ ఏఏ సిబ్బంది అంటున్నారు. కానీ వైట్ హౌస్ మీడియా ప్రకారం సైబర్‌దాడి జరిగినదని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవంటున్నారు.

కొన్ని పారిశ్రామిక వర్గాల అభిప్రాయం ప్రకారం ఈ సంఘటనను 2001లోని 9/11 ఉగ్రదాడి పరిణామాలతో పోలుస్తున్నారు. ఈసంఘటనపై పూర్తి విచారణ జరిపి, నివేదిక ఇవ్వవలసిందిగా అధ్యక్షుడు జోబైడెన్ రవాణా మంత్రిత్వశాఖను ఆదేశించారు. ప్రయాణీకుల భద్రతకు ఏ ప్రమాదం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. సాంకేతిక లోపానికి సరైన కారణం ఇంకా తెలియరాలేదని, కానీ విమానాలు ల్యాండింగ్‌లో ఏ అంతరాయాలు కలుగలేదని, టేకాఫ్‌లో మాత్రం కాస్త అసౌకర్యం నెలకొందని బైడెన్ తెలిపారు. ఆన్‌లైన్ ఫ్లైట్ ట్రాకర్ ప్రకారం అమెరికాలో దాదాపు 10 వేల విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. 1300 విమానాలు రద్దయ్యాయి. మరో 12 గంటల్లో పరిస్థితులు అన్నీ చక్కబడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

