Home Page SliderNationalviral

ఎమర్జెన్సీపై కాంగ్రెస్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ శశి థరూర్..దేశ చరిత్రలో చీకటి అధ్యాయంగా మిగిలిన ఎమర్జెన్సీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో దివంగత ప్రధాని ఇందిరా గాంధీ కుమారుడు సంజయ్ గాంధీ వ్యవహరించిన తీరు అత్యంత క్రూరంగా ఉందని, ఆయన చర్యలు మాటల్లో చెప్పలేని హింసకు దారితీశాయని తీవ్రంగా విమర్శించారు. ఎమర్జెన్సీని కేవలం ఒక మరపురాని ఘట్టంగా కాకుండా, ఓ గుణపాఠంగా చూడాలని ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలో అత్యవసర పరిస్థితి విధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఓ మలయాళ పత్రికకు రాసిన వ్యాసంలో థరూర్ ఈ విషయాలను ప్రస్తావించారు. “1975-77 మధ్యకాలంలో సంజయ్ గాంధీ గ్రామీణ ప్రాంతాల్లో బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించారు. నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి హింసను మార్గంగా ఎంచుకున్నారు. అదుపులేని అధికారం నిరంకుశత్వానికి ఎలా దారితీస్తుందో ఆనాటి ఘటనలు నిరూపించాయి. ఆ చర్యలను తర్వాత ‘దురదృష్టకరం’ అని అభివర్ణించినా, ఆ గాయాలను ఎవరూ మర్చిపోలేరు” అని థరూర్ తన వ్యాసంలో పేర్కొన్నారు. ఎమర్జెన్సీ సమయంలో ఢిల్లీ లాంటి నగరాల్లో మురికివాడలను కనికరం లేకుండా కూల్చివేశారని, వేలాది మందిని నిరాశ్రయులను చేశారని గుర్తుచేశారు. పౌరుల ప్రాథమిక హక్కులను అణచివేసి, భావ ప్రకటనా స్వేచ్ఛను పూర్తిగా హరించడం భారత రాజకీయాల్లో ఒక మాయని మచ్చగా మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ చీకటి రోజుల నుంచి పాఠాలు నేర్చుకుని, భవిష్యత్తులో ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని శశి థరూర్ పిలుపునిచ్చారు.