Home Page SliderNational

కర్నాటకలో 116 స్థానాల్లో ఆధిక్యంలో కాంగ్రెస్

కర్నాటకలో 116 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో దూసుకుపోతోంది. ఇక బీజేపీ 77 స్థానాల్లో లీడ్ లో ఉంది. జేడీఎస్ పార్టీ 27 స్థానాల్లో ఆధిక్యాన్ని కనబర్చుతోంది. ఇతరులు 3 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మెజార్టీకి కావాల్సిన 113 స్థానాలను దాటి ఆధిక్యంలో కొనసాగుతోంది.ఐతే ముఖ్యమంత్రి బసవరాజ్ ఎస్ బొమ్మై బీజేపీ విజయంపై ధీమాగా ఉన్నారు. కాంగ్రెస్, తన శాసనసభ్యులపై విశ్వాసం లేనందున ఇతర పార్టీలతో కలవాలని ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ 120 మార్కును దాటడం ఖాయమని మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. కింగ్‌మేకర్‌గా అవతరించాలని ఉవ్విళ్లూరుతున్న జేడీఎస్‌ నేత హెచ్‌డీ కుమారస్వామి తాను ఏ పార్టీతోనూ టచ్‌లో లేనని చెప్పారు. గురువారం ఎన్నికలు జరిగిన కర్నాటకలోని 224 అసెంబ్లీ స్థానాలకు 36 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని పెద్ద ఎత్తున ప్రచారం చేసిన బీజేపీ కర్నాటకలో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చి… 38 ఏళ్ల చరిత్రను తిరగరాయాలని భావిస్తోంది. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడం ద్వారా వచ్చే లోక్ సభ ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేసుకునేందుకు ఉపకరిస్తోందని కాంగ్రెస్ పార్టీ విశ్వాసంతో ఉంది. కర్నాటకలో త్రిముఖ పోటీ నెలకొనగా, చాలా నియోజకవర్గాల్లో బీజేపీ, కాంగ్రెస్, జేడీ(ఎస్) మధ్య పోటీ నెలకొంది. ఢిల్లీ, పంజాబ్‌లలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కూడా కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను రంగంలోకి దించింది. శరద్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ పలు స్థానాల్లో పోటీ చేసింది. 10 ఎగ్జిట్ పోల్స్‌లో ఏడు కర్ణాటకలో హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని అంచనా వేసింది. ఇద్దరు కాంగ్రెస్‌కు, ఒకరు బీజేపీకి సంపూర్ణ విజయం లభిస్తోందని అంచనా వేశారు. హంగ్ హౌస్ ఆశిస్తున్న హెచ్‌డి కుమారస్వామికి చెందిన జెడి(ఎస్) కింగ్‌మేకర్‌గా ఉండే అవకాశం ఉందన్న అభిప్రాయం కూడా ఉంది.

బీజేపీకి చెందిన ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, కాంగ్రెస్ సీనియర్ నేతలు సిద్ధరామయ్య, డికె శివకుమార్, కుమారస్వామి ఎన్నికల్లో ఇవాళ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 2018 ఎన్నికలలో, బీజేపీ 104 సీట్లు, కాంగ్రెస్ 80 మరియు జేడీఎస్ 37 సీట్లు గెలుచుకున్నాయి. బీజేపీ ముఖ్యనేత బీఎస్ యడ్యూరప్ప ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు, అయితే మెజారిటీ పరీక్షకు ముందే రాజీనామా చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. సంకీర్ణ ప్రభుత్వం 14 నెలల పాటు కొనసాగింది. ఆ తర్వాత 16 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడంతో సంకీర్ణ సర్కారు కూలి, బీజేపీ ఆధ్వర్యంలో కర్నాటకలో ప్రభుత్వం ఏర్పాటయ్యింది.