‘కాంగ్రెస్ ‘హైడ్రా’ పేరుతో హైడ్రామాలు చేస్తోంది’..కేటీఆర్
ప్రభుత్వం చేసే పనులలో మానవీయకోణం ఉండాలని, ఇలా హైడ్రా పేరుతో హైడ్రామాలు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు కేటీఆర్. అధికార కాంగ్రెస్ పార్టీ 10 నెలల పాలనా కాలంలో ఒక్క మంచిపని కూడా చేయలేదన్నారు. కూకట్ పల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ హైడ్రా చర్యలు దారుణమన్నారు. ముందుగా నిర్వాసితులకు ఇళ్లు పంపిణీ చేసి, తర్వాత కట్టడాలు కూల్చాలన్నారు. పేదవారికి, మధ్యతరగతి వారికి ఈ కూల్చివేతలు జీవితంలో కోలుకోలేని దెబ్బలుగా మారుతున్నాయన్నారు. ఈ ప్రభుత్వంలో కుడిచేయి చేసే పని, ఎడమచేతికి తెలియకుండా పోతోందన్నారు. కేవలం మూడు రోజుల కింద రిజిస్ట్రేషన్ అయిన విల్లాలలను అదే ప్రభుత్వంలోని మరో శాఖ కూల్చి వేస్తోందన్నారు. అలాంటప్పుడు రిజిస్ట్రేషన్లు ఎలా చేశారని మండిపడ్డారు. హైదరాబాద్కు రూ.10వేల కోట్లు బడ్జెట్లో కేటాయించామని చెప్పి, ఇంతవరకూ రూపాయి కూడా విదిల్చలేదు సరికదా, పేదలను ఇబ్బంది పెడుతోందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఒక్క కొల్లూరులోనే 16 వేల ఇళ్లు ఉన్నాయని వాటిని ఆ పేదవారికి కేటాయించాలని కోరారు.