Home Page SliderNational

CWC సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ చేరుకున్న కాంగ్రెస్ అతిరథమహారధులు

సీడబ్ల్యూసీ సమావేశం, తుక్కుగూడ విజయ భేరి సమావేశంలో పాల్గొనేందుకు భారత జాతీయ కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ హైదరాబాద్‌ చేరుకున్నారు. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా ఇతర పార్టీల నేతలతో కలిసి శనివారం శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన సోనియా గాంధీకి కాంగ్రెస్ నేతలు కేసీ వేణుగోపాల్, ఠాక్రే, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి, వీహెచ్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్వాగతం పలికారు.

హైదరాబాద్‌లోని విమానాశ్రయంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు మాజీ పార్లమెంట్ సభ్యుడు, టీపీసీసీ ప్రచార కమిటీ కో-చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్‌లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాల్లో పాల్గొనేందుకు కాంగ్రెస్ అగ్రనేతలు హైదరాబాద్ చేరుకున్నారు. సీడబ్ల్యూసీ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం అనుసరించబోతున్న అనేక విషయాలపై పార్టీ నేతలు చర్చిస్తున్నారు. మరీ ముఖ్యంగా ప్రత్యేక పార్లమెంట్ సెషన్ విషయంలో ఎలాంటి వైఖరి అవలంబించాలన్నదానిపై పార్టీ చర్చిస్తోంది. తెలంగాణలో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అధికారాన్ని దక్కించుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్ నేతలు సోనియా అస్త్రాన్ని ప్రయోగించాలని చూస్తున్నారు.