Andhra PradeshNews

ఆంధ్రప్రదేశ్‎లో మహా కూటమి కోసం కామ్రేడ్స్ వ్యూహాలు

ఏపీలో ఎన్నికల సమీపిస్తున్న కొద్ది రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. తాజాగా చంద్రబాబు, పవన్ కలయికతో ఆంధ్రాలో రాజకీయం రసవత్తరంగా మారింది. 2009 నాటి మహా కూటమి మరోసారి ఏర్పాటు కాబోతోందనే చర్చ ఆంధ్ర ప్రదేశ్‎లో మొదలైంది. ఈ చర్చకి కామ్రేడ్స్ మాట్లాడే మాటలు కూడా బలాన్ని చేకూరుస్తున్నాయి. ఏపీలో పొత్తులకు ఒక అడుగు ముందుకు పడిందనే అనుకోవాలి. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ఎలా అయినా వైసీపీని గద్దదించాలన్న కృతనిశ్చయంతో కీలకమైన బాధ్యతలను భుజానికి ఎత్తుకున్నారు. అందులో భాగంగానే ఆయన స్వయంగా విజయవాడ వెళ్ళి పవన్ బస చేసిన హొటల్ లోనే ఆయనతో చర్చలు జరిపి అయిదేళ్ల క్రితం నాటి పాత స్నేహాన్ని తిరిగి పట్టాలెక్కించే పనిలో పడ్డారు. దీంతో జనసేన, టీడీపీ పొత్తులు ఇక ఖాయమే అన్న మాట అంతటా వినిపిస్తోంది. మరోవైపు చూస్తే బీజేపీ కూడా ఈ కూటమిలో చేరుతుందని వినిపిస్తున్నా ప్రస్తుతానికి అదంత సులువు కానే కాదు విశ్లేషకులు అంటున్నారు.

బీజేపీ కూటమికి దూరంగా ఉంటే ఆ ప్లేస్‌లోకి రావడానికి ఉభయ కమ్యూనిస్టు పార్టీలు సిద్ధంగానే ఉన్నాయని అంటున్నారు. దీని మీద సీపీఐ రామకృష్ణ మాట్లాడుతూ బీజేపీ లేకుంటే జనసేన, టీడీపీ కూటమిలో తాము చేరడానికి సిద్ధం అని ప్రకటించారు. ఏపీలో బీజేపీ వైసీపీకే మద్దతుగా ఉంది కాబట్టి ఆ పార్టీని వీడాల్సిందే అని ఆయన అంటున్నారు. తన మాజీ మిత్రుడు పవన్ కళ్యాణ్‌కి ఇదే విషయాన్ని ఆయన మీడియా ముఖంగానే స్పష్టం చేశారు. బీజేపీని వీడే విషయంలో పవన్ క్లారిటీ ఇస్తే జగన్‌ను ఏపీలో ఉమ్మడిగా ఎదుర్కొనే విషయంలో సీపీఐ కూడా సహకరిస్తుందన్నట్లుగా ఆయన మాట్లాడారు. మరోవైపు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు కూడా ఇదే రకమైన కామెంట్స్ చేశారు. అధికార పార్టీని ఓడించాలంటే అన్ని పక్షాలు కలసికట్టుగా పనిచేస్తేనే సాధ్యమన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.

ఏపీలో ఉమ్మడి కార్యాచరణ అవసరమని వైసీపీ సర్కార్ విధానాలకు వ్యతిరేకంగా అంతా కలవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు ఇప్పటికే పిలుపు ఇచ్చారు. దానికి కామ్రెడ్స్ స్పందిస్తూ మేము కూడా సిద్ధమంటున్నాయి. అయితే బీజేపీ లేని కూటమిలోకే రావాలనుకుంటున్నారు. బీజేపీ విషయంలో ఎలా అడుగు వేయాలన్నదానిపై జనసేన, టీడీపీ ఏం ఆలోచిస్తున్నాయో చూడాల్సి ఉంది. అలాగే ఏపీలో బీజేపీ స్టాండ్ కూడా ఎలా ఉండబోతోంది అన్న దానిని బట్టే కామ్రేడ్స్ కూటమికి మద్దతు ఇచ్చే అవకాశాలు ఆధారపడి ఉంటాయి. మొత్తం మీద చూస్తే బీజేపీ కంటే కామ్రేడ్స్‌తో వెళ్లడమే బెటర్ అని బాబు, పవన్ భావిస్తే మాత్రం ఏపీలో విపక్ష రాజకీయం పూర్తిగా మారుతుంది. అప్పుడు కాంగ్రెస్, బీజేపీ ఒంటరి పోరుకే సిద్ధపడాల్సి ఉంటుంది. ఏది ఏమైనా ఏపీలో రాజకీయాలు మార్చే విధంగానే పవన్ అడుగులు వేయబోతున్నారు. రానున్న ఎన్నికల్లో ఏఏ పార్టీలు జత కలిసి పోటీ చేసిన తాము మాత్రం ఒంటరిగానే బరిలోకి దిగుతామని ఇప్పటికే వైసీపీ స్పష్టం చేసింది. పొత్తుల వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టమో చూడాల్సి ఉంది.