భారీ వర్షాలపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష
తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలతో వాటిల్లిన నష్టం, వరద సహాయక చర్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షిస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సమీక్ష సమావేశానికి మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ జితేందర్, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. సమీక్ష అనంతరం ముఖ్యమంత్రి కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి రోడ్డు మార్గంలో ఖమ్మంకు బయలుదేరుతారు. ఖమ్మంలోని వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం పరిశీలించనున్నారు.
భారీ వర్షాలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని, కలెక్టరేట్లలో కాల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ప్రజలకు జరిగిన నష్టంపై అధికారులు స్పందించి.. వరదనష్టంపై కేంద్రానికి సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు. అత్యవసర సేవల కోసం పోలీస్ బెటాలియన్లకు..ఎన్‌డీఆర్‌ఎఫ్ తరహాలో శిక్షణ ఇవ్వాలని అధికారులకు సీఎం సూచించారు.