కర్నూలు జిల్లా పత్తికొండలో రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం జగన్
వైఎస్సార్ రైతు భరోసా ఐదో ఏడాది మొదటి విడత నిధుల విడుదల సందర్భంగా సీఎం జగన్ కర్నూలు జిల్లా పత్తికొండలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రూ. 5,500 పెట్టుబడి సాయాన్ని బటన్ నొక్కి నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ రైతన్నకు సేవ చేసే ఈ అవకాశం ఇచ్చిన దేవుడికి సదా రుణపడి ఉంటానన్నారు. రైతన్న ఎక్కడా ఇబ్బంది పడకూడదనే పెట్టుబడి సాయం అందిస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. వైఎస్‌ఆర్ రైతు భరోసాతో అన్నదాతలకు ఎంతో మేలు జరిగిందన్నారు. రైతులకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్నామని.. ప్రస్తుతం 52,30,939 మంది రైతన్నల ఖాతాల్లోకి నిధులు విడుదల చేస్తున్నట్లు వివరించారు. గత ప్రభుత్వం రైతుల్ని మోసం చేసిందన్నారు. కానీ మీ బిడ్డ ప్రభుత్వం మొదటి నుంచి రైతులకు అండగా ఉంటోందని ప్రతీ రైతన్నకు రూ.61,500 సాయం అందించామని వివరించారు. మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన ప్రతీ హామీని నిలబెట్టుకున్నామని, మేనిఫెస్టోలో ప్రకటించిన దాని కంటే ఎక్కువగా రూ.12,500కి బదులుగా ఏడాదికి రూ.13,500 రైతు భరోసా సాయాన్ని అందిస్తున్నట్లు సీఎం జగన్ వివరించారు. అయితే ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో రూ. 31 వేల కోట్లు జమ చేశామని సీఎం జగన్ స్పష్టం చేాశారు.