ఆలీకి సీఎం జగన్ కీలక బాధ్యతలు..
ప్రముఖ సినీ నటుడు ఆలీకి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కీలక బాధ్యతలు అప్పగించారు. ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా ఆలీని నియమించినట్లు జగన్ అధికారికంగా ప్రకటించారు. ఇక తనకు జగన్ అప్పజెప్పిన బాధ్యతను నియమ నిబంధనలతో నిర్వర్తిస్తానని ఆలీ ఆనందం వ్యక్తం చేశారు. చాలా కాలంగా ఆలీకి ఏపీ ప్రభుత్వంలో కీలక పదవి దక్కుతుందనే ప్రచారం సాగింది. 2019 ఎన్నికల సమయంలో ఆలీ వైసీపీ పార్టీలో చేరారు. గత ఎన్నికల్లో సీటు ఇస్తారని భావించినా, ఆయన పోటీ చేయలేదు. తర్వాత జగన్ ప్రభుత్వంలో నామినేటెడ్ పదవి ఇస్తారని ప్రచారం సాగింది. అయితే.. కొద్ది రోజుల క్రితం ఆలీ తన సతీమణితో కలిసి సీఎం నివాసానికి వెళ్లి కలిశారు. రాజ్యసభ లేదా ఎమ్మెల్సీ అవకాశం ఇస్తారని అనుకున్నారు. కానీ ఆలీ తాను సీఎం జగన్‌తో కలిసిన సమయంలో ఎటువంటి పదవి కావాలని కోరలేదని, ఏ బాధ్యత అప్పగించినా సిద్దమేనని అన్నారు. ప్రస్తుతం ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు పదవి కేటాయించారు. ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌గా ప్రముఖ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు పేరు ఖరారైంది.