Andhra PradeshNews

టార్చర్ ఆఫీసుగా సిఐడి కార్యాలయం : చంద్రబాబు

ఏపీలో సిఐడి కార్యాలయం టార్చర్ కు నెలవుగా మారిందని చంద్రబాబు నాయుడు విమర్శించారు. కోర్టులు హెచ్చరిస్తున్న కస్టోడియల్ టార్చర్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టాన్ని ఉల్లంఘించే అధికారులు ఒకటి గుర్తుంచుకోవాలని అధికారం తాత్కాలికమేనని చట్టం శాశ్వతమని ప్రైవేట్ కేసులు వేస్తామని హెచ్చరించారు. టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అరెస్టుపై తీవ్రస్థాయిలో చంద్రబాబు ధ్వజమెత్తారు. విశాఖ భూ దోపిడి, పాలన వైఫల్యాలు, వివేక హత్య కేసులో సిబిఐ కు షర్మిల ఇచ్చిన వాంగ్మూలం పై ప్రజల దృష్టిని మరల్చేందుకు తప్పుడు కేసులు బనాయిస్తూ అరెస్టులు చేస్తున్నారని ఇదే టెక్నిక్ ను మొదటి నుంచి అధికార వైసీపీ ఫాలో అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖలో వైసీపీ నేతలు భూదోపిడి కబ్జాలు సెటిల్మెంట్ లపై తమ పార్టీ పోరాటం చేస్తుందని దీనిపై కోర్టు కూడా విచారణకు ఆదేశించిందని దీంతో మళ్లీ అక్రమ అరెస్టులకు తెరదీసారని ధ్వజమెత్తారు. అయ్యన్నపాత్రుడిని తెల్లవారుజామున మూడు గంటలకు అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని రెండు సెంట్లు భూమి కోసం ఇలా దొంగలలా అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడతారా అని సిఐడి అధికారులపై నిప్పులు చెరిగారు. అయ్యన్నపాత్రుడు హత్యలు, తప్పుడు పనులు ఏమి చేయలేదని అటువంటప్పుడు అర్ధరాత్రి అరెస్టులు దేనికని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి ధైర్యం ఉంటే వివేకానంద హంతకులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. 70 ఏళ్ల వయసులో అయ్యన్నపాత్రుడు పై రేప్ కేసు పెట్టడం ఏంటని మండిపడ్డారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు, ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు