Andhra PradeshHome Page SliderNewsPoliticsTrending Today

 అభివృద్ధి పేరుతో ముఖ్యమంత్రి మాయాజాలం..

ఆంధ్రప్రదేశ్‌ని సింగపూర్ చేస్తామని కూటమి ప్రభుత్వం ప్రజలకు కుచ్చుటోపీ పెడుతోంది. ప్రజలపై రుణ భారం పెంచుతూ వారి నడ్డి విరిచేస్తోంది. వైసీపీ నేత జగన్ పాలనలో విధ్వంసం జరిగిందని గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మూడు పార్టీలూ కోడై కూసాయి. దీనితో ప్రజలు పవర్ స్టార్ చెప్పాడని నమ్మి, ఓట్లు వేశారు. ఇకపై ‘స్వర్ణాంధ్రప్రదేశ్ చూపిస్తాం’ అంటూ హడావుడి చేసింది కొత్త ప్రభుత్వం. ఏడాది దాటగానే అసలు రంగు బయటపడింది. ‘మేడిపండు చూడ మేలిమై ఉండు..పొట్ట విప్పి చూడ పురుగులుండు..’ అన్నట్లు నిజమైన గణాంకాలు చూస్తే ఎవరి పాలనలో విధ్వంసం జరిగిందో తెలుస్తోంది. కాగ్ లెక్కల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కన్నా 2023-24 వ ఆర్థిక సంవత్సరంలోనే రెవెన్యూ రాబడులు ఎక్కువ వచ్చినట్లు తెలుస్తోంది. జగన్ పాలన కాలంలో రెవెన్యూ రాబడులు రూ.1,73,963 కోట్లు ఉంటే, 2024-25 ఆర్థిక సంవత్సరంలో కూటమి హయాంలో రూ.1,68,443 కోట్లకు తగ్గిపోయింది. ప్రభుత్వం అంచనా వేసిన రాబడి రూ.2,01,173 కోట్లు. దీనిలో 80 శాతం కూడా లభించలేదు. ఆదాయం లభించకపోగా మరో రూ.81,617 కోట్ల రుణాలు సమకూర్చినట్లు ‘కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్’ వెల్లడించిన నివేదికలో తెలుస్తోంది.   ప్రతీ ఏటా ఇదేవిధంగా స్టాంప్స్ అండ్ రిజిస్టేషన్స్, అమ్మకం పన్ను, మూలధన వ్యయం, కేంద్ర గ్రాంట్లు, సామాజిక వ్యయాలలో కూడా గణనీయంగా తగ్గుదల కనిపించింది. ఆదాయం తగ్గడంతో పాటు రోకలి పోటులా వ్యయాలు కూడా పెరిగిపోయాయి. రెవెన్యూ లోటు రూ.37,468 నుండి రూ. 57,456కి పెరిగింది. అలాగే ద్రవ్యలోటు కూడా రూ.61,765 నుండి రూ.81,622కి పెరిగింది. అయితే తమ ప్రభుత్వం అద్భుతం చేస్తున్నట్లు మభ్య పెట్టడానికి రాష్ట్రంలో ఇప్పటికే పెట్టుబడులు పెట్టి విస్తరణ పూర్తయిన వాటిని కొత్త ప్రాజెక్టులుగా పేర్కొంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో వచ్చిన పెట్టుబడులను కూడా తాము సాధించినట్లు చెప్పుకుంటున్నారు. వీటిలో జపాన్‌కు చెందిన ఏటీసీ టైర్స్, పీఎల్‌ఐ డైకిన్ సంస్థ, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ రక్షణ పరికరాల తయారీ యూనిట్, డక్కన్ పైన్ కెమికల్స్ వంటి సంస్థలు వైసీపీ హయాంలోనే పెట్టుబడులకు అంగీకారం తెలిపి, పనులు మొదలుపెట్టాయి. కానీ వాటిని ఇప్పుడు కొత్తగా చంద్రబాబు ప్రభుత్వమే వాటిని ఆకర్షించినట్లుగా క్రెడిట్‌ను తమ ఖాతాలో వేసుకుంటున్నారు.