Andhra PradeshNews

సీరియస్ యాక్షన్‎కు సిద్ధమవుతున్న చంద్రబాబు

◆ పార్టీలో కుమ్ములాటలకు చెక్
◆ ఏ స్థాయి నేతపైనైనా క్రమశిక్షణ చర్యలు
◆ చంద్రబాబుకు తలనొప్పిగా మారిన ఆధిపత్య పోరు, కుమ్ములాటలు

ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎలా అయినా గెలవాలన్న సంకల్పంతో టీడీపీ అధినేత చంద్రబాబు పక్కా వ్యూహాలతో తన కేడర్ ను సిద్ధం చేస్తున్న తరుణంలో ఆ పార్టీలో తమ్ముళ్ల కుమ్ములాట ఆధిపత్య పోరు తలనొప్పిగా మారుతోంది. పార్టీలో నేతల మధ్య విభేదాలు కీచులాట చంద్రబాబును టెన్షన్‌కు గురిచేస్తున్నాయి. వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజలకు దగ్గరవుతున్న తరుణంలో నియోజకవర్గాల్లో నేతల మధ్య విభేదాలు ఆధిపత్య పోరు నానాటికి పెరుగుతుండటం కలవరానికి గురిచేస్తోంది. చంద్రబాబు చేస్తున్న హెచ్చరికలను కొందరు నేతలు సీరియస్‌గా తీసుకోకుండా ఎప్పటిలాగానే నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాలు నడుపుతోండటంతో అక్కడ ఉన్న పార్టీ క్యాడర్ నైరాశ్యానికి గురవుతోంది. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్న చంద్రబాబు నేతల పనితీరుకు సంబంధించిన నివేదికలను రహస్య సర్వేలను వెల్లడిస్తూ అవసరమైన సూచనలు సలహాలు ఇవ్వటమే కాకుండా నేతలకు కఠినమైన హెచ్చరికలు కూడా చేస్తున్నారు. ఈ హెచ్చరికలను కొందరు ముఖ్య నేతలు ఖాతరు చేయకుండా మళ్లీ ఆధిపత్య పోరుకు తెరదీయటం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

ముఖ్యంగా అనంతపురం, గుంటూరు, కర్నూలు, ఎన్టీఆర్ జిల్లాల్లో జరుగుతున్న పరిణామాలు రాష్ట్రవ్యాప్తంగా రచ్చకెక్కడంతో దీనిపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు తెలిసింది. సత్తెనపల్లి, కళ్యాణదుర్గం ఘటనలు చంద్రబాబును తీవ్ర అసహనానికి గురిచేశాయని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. దీంతో చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగి తెలుగు తమ్ముళ్ల కుమ్ములాటలకు చెక్ పెట్టె దిశగా చర్యలకు ఉపక్రమించనున్నట్లు తెలుస్తోంది. ఏ స్థాయి నేతపై అయినా క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు వెనుకాడేది లేదని ఇప్పటికే స్పష్టం చేసిన చంద్రబాబు ఇప్పుడు ఆ దిశగా చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ వారంలోనే విభేదాలున్న నియోజకవర్గాల నేతలతో మరోసారి సమీక్షా సమావేశాలు నిర్వహించి కఠినమైన చర్యలు తీసుకోవాలన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లుగా తెలుస్తోంది. పార్టీకి ఆదరణ పెరుగుతున్న తరుణంలో నేతలు రెట్టించిన ఉత్సాహంతో పని చేయాల్సి ఉండగా అంతర్గత విభేదాలతో రచ్చకక్కడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న ఆయన కొంత కఠినంగా వ్యవహరించాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

సత్తెనపల్లి, కళ్యాణదుర్గంతో పాటు ఏపీలో కొన్ని నియోజకవర్గాల్లో ఉన్న ఇదే పరిస్థితి పై చంద్రబాబు దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. తొలుత కళ్యాణదుర్గం, సత్తెనపల్లి అంశాలపై కఠిన చర్యలు తీసుకొని ఆ సంకేతాలను మిగిలిన నేతలకు పంపాలన యోచనలో టీడీపీ అధినేత ఉన్నారట. ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ఈ విభేదాలను సరి చేయని పక్షంలో పార్టీకి నష్టం చేకూరుతోందన్న ఆందోళనలో ఉన్న చంద్రబాబు వీటి కట్టడిపై సమగ్ర ప్రణాళికను రూపొందిస్తున్నారు. అలానే నియోజకవర్గాల్లో ప్రజలలో తిరగని నాయకులపై కూడా వేటువేసి ఆ స్థానంలో కొత్త వారిని నియమించే ప్రయత్నాలు కూడా చంద్రబాబు ప్రారంభించినట్లు తెలుస్తోంది. కొన్ని నియోజకవర్గాల్లో నెలకొన్న పరిస్థితులపై పార్టీ అధిష్టానానికి కార్యకర్తల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. ముఖ్యంగా నియోజకవర్గాల్లో నెలకొన్న గ్రూపు రాజకీయాలు కేడర్ ను కలుపుకొని ముందుకు వెళ్లని నేతలపై ఈ ఫిర్యాదులు రావడం పై అధిష్టానం దృష్టి సారించింది. వీటన్నిటిపై దృష్టి పెట్టిన చంద్రబాబు పార్టీలో అత్యధిక ప్రాధాన్యత ఉన్న నేతలను రంగంలోకి దింపి స్థానిక కుమ్ములాటలకు చెక్ పెట్టాలని యోచనలో ఉన్నారని తెలుస్తోంది.