చంద్రబాబు పచ్చి అబద్ధాలతో ప్రజలను మభ్యపెడుతున్నారు
పోలవరం ప్రాజెక్ట్ ఆలస్యానికి ముఖ్య కారణం చంద్రబాబేనని, ఆయన పచ్చి అబద్ధాలతో ప్రజలను మభ్యపెడుతున్నారని మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆరోపించారు. ఆదివారం ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ, పోలవరంపై చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు అబద్ధాల పుట్ట అని ఘాటు విమర్శలు చేశారు.కాఫర్ డ్యామ్ పూర్తి కాకుండా డయాఫ్రమ్ వాల్ ఎలా కట్టారని ప్రశ్నించిన బుగ్గన, కుప్పానికి నీళ్లు ఇచ్చానంటూ చంద్రబాబు చెప్పిన మాటలు కూడా అసత్యమని అన్నారు. పోలవరానికి శంకుస్థాపన చేసి, అనుమతులు తెచ్చింది వైఎస్సార్ అని గుర్తు చేశారు. 2004–2014 మధ్యలో కుడికాల్వకు 10,628 ఎకరాలు, ఎడమ కాల్వకు 10,343 ఎకరాల భూసేకరణ పూర్తయిందని వివరించారు. పునర్‌వ్యవస్థీకరణ చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్ట్ కేంద్ర బాధ్యత అని స్పష్టం చేసిన ఆయన, దానిని స్వాధీనం చేసుకోవడం చంద్రబాబు చేసిన చారిత్రక తప్పిదమని అన్నారు. 2016 సెప్టెంబర్ 8న అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో చేసిన ఒప్పందం కారణంగా రాష్ట్రానికి భారీ నష్టం జరిగిందని ఆరోపించారు. రూ.50 వేల కోట్ల విలువైన ప్రాజెక్ట్‌ను చంద్రబాబు రూ.20 వేల కోట్లకే ఒప్పుకున్నారని, అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ మొత్తం రూ.48 వేల కోట్లకు పెరిగిందని వివరించారు. పోలవరంపై తప్పుడు విధానాల వల్ల రాష్ట్రానికి అనేక నష్టాలు వాటిల్లాయని బుగ్గన పేర్కొన్నారు. వైఎస్ జగన్ అనేక సార్లు ఢిల్లీకి వెళ్లి మూసివేసిన పోలవరం ఫైలును తిరిగి తెరిపించారని అన్నారు. “మేం సాధించిన డబ్బులే పోలవరం ప్రాజెక్ట్‌పై కూటమి ప్రభుత్వానికి వస్తున్నాయి. అక్టోబర్ 2024లో వచ్చిన నిధులను జనవరి 2025లో ఖర్చు చేస్తున్నారు” అని విమర్శించారు. జలయజ్ఞం ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ, వైఎస్సార్ హయాంలో 83 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, ఆయన మరణ సమయానికి 43 ప్రాజెక్టులు పూర్తి చేశారని తెలిపారు. 32 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్లు ఇచ్చిన ఘనత వైఎస్సార్‌దేనని గుర్తు చేశారు. హంద్రీనీవా ప్రాజెక్ట్‌పై కూడా చంద్రబాబు దారుణమైన అబద్ధాలు చెబుతున్నారని, వాస్తవానికి ఎక్కువ భాగం పనులు వైఎస్సార్ హయాంలోనే పూర్తయ్యాయని అన్నారు. మిగతా పనులను వైఎస్ జగన్ వేగంగా పూర్తి చేశారని బుగ్గన రాజేంద్రనాథ్ వ్యాఖ్యానించారు.