Home Page Sliderhome page sliderNewsTelanganatelangana,Trending Todayviral

ఛాలెంజ్ డే ఈరోజే… సై అంటే సై…

తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనపై బీఆర్‌ఎస్ వర్గం తీవ్ర విమర్శలు చేస్తూ, ప్రతిపక్షనేత కేటీఆర్‌ సీఎం రేవంత్‌రెడ్డికి ఓపెన్ చాలెంజ్ విసిరారు. “సై అంటే సై.. ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధం” అంటూ డేట్, టైమ్, ప్లేస్ మీరు చెప్పినా ఓకే అని ధైర్యంగా ప్రకటించారు. రేవంత్‌ రెడ్డి ఇటీవల తన ప్రభుత్వంలో ఉద్యోగ నియామకాలు, రైతు సంక్షేమం వంటి అంశాలపై బీఆర్‌ఎస్‌ను టార్గెట్ చేస్తూ సవాలు విసిరిన నేపథ్యంలో, కేటీఆర్‌ స్పందిస్తూ అదే స్థాయిలో ప్రతిసవాల్ విసిరారు. ఈ చర్చకు తుది సమయంగా జూలై 8 ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌ను కేటీఆర్ నిర్ణయించారు. ఇక కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మళ్లీ ఒకసారి ప్రస్తావిస్తూ, బీఆర్ఎస్‌ పదేళ్ల పాలనలో రైతులకు జరిగిన అన్యాయం, తాము ఏడాదిలో చేసిన లక్ష కోట్ల సాయంపై చర్చకు సిద్ధమన్నారు. అసెంబ్లీ అయినా, పార్లమెంట్ అయినా, ఏ వేదికైనా సరే చర్చ చేద్దామని సవాల్ విసిరారు. “కేసీఆర్‌ రాకపోతే, కేటీఆర్ అయినా, కిషన్ రెడ్డి అయినా ఎవరు వచ్చినా సరే.. మేము సిద్ధంగా ఉన్నాం” అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు. దీనిపై బీఆర్‌ఎస్‌ నేతలు, మంత్రులు స్పందిస్తూ — చర్చ ప్రెస్‌క్లబ్‌ లో కాదు, అసెంబ్లీలో జరగాలన్నారు. అయితే కేటీఆర్ మాత్రం “సీఎం సింగిల్‌గా వచ్చినా సరే, గుంపుగా వచ్చినా సరే” అంటూ తాను ప్రెస్‌క్లబ్‌కు ప్రజాప్రతినిధులతో సహా వచ్చేందుకు సిద్ధమని తెలిపారు. ఇది రాష్ట్రంలో ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్న హాట్ టాపిక్‌గా మారింది. ఈ సమావేశం నిజంగానే జరుగుతుందా? సీఎం హాజరవుతారా? లేక మరొకసారి మాటల యుద్ధమే కొనసాగుతుందా అన్నది చూడాల్సిందే.