Telangana

మునుగోడులో గుర్తు మార్పు..రిటర్నింగ్ అధికారిపై సీఈసీ ఆగ్రహం

మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ సమీపిస్తున్న కొద్ది… అక్కడి రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఉపఎన్నికలో గుర్తులకు సంబంధించిన మరో వివాదం చోటు చేసుకుంది. రిటర్నింగ్ అధికారి ఓ ఇండిపెండెంట్ అభ్యర్థికి మొదట రోడ్డు రోలర్ గుర్తును కేటాయించారని.. కానీ టీఆర్ఎస్ ఒత్తిడితో అంతలోనే మళ్లీ వెనక్కి తీసుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే గుర్తుల జాబితా నుంచి రోడ్డు రోలర్ మాయమవడంపై దుమారం రేగుతోంది. ఈ నేపథ్యంలో ఉపఎన్నికలో గుర్తు మార్పు వివాదాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. మునుగోడు రిటర్నింగ్‌ అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. యుగతులసి పార్టీకి చెందిన అభ్యర్థి కె.శివకుమార్‌కు కేటాయించిన రోడ్డు రోలర్‌ గుర్తు మార్పును ఈసీఐ తప్పుబట్టింది. మునుగోడు అభ్యర్థులకు కేటాయించిన గుర్తుల జాబితా సవరించాలని స్పష్టం చేసింది.


ఎందుకు ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో రిటర్నింగ్‌ అధికారి నుంచి వివరణ తీసుకోవాలని.. నివేదికను సాయంత్రం 5 గంటల లోపు పంపాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో)ను ఈసీఐ ఆదేశాలు జారీ చేసింది. ఈసీఐ ఆదేశాల నేపథ్యంలో ఫారం 7(ఎ)ను ఎన్నికల అధికారులు సవరించారు. యుగతులసి అభ్యర్థి శివకుమార్‌కు తిరిగి రోడ్డు రోలర్‌ గుర్తును కేటాయిస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఇక మారిన గుర్తులతో బ్యాలెట్‌ ముద్రణకు చర్యలు చేపట్టనున్నారు. తనకు మొదట రోడ్డు రోలర్ గుర్తు కేటాయించారని తర్వాత గుర్తు మార్చారని యుగతులసి పార్టీ అభ్యర్థి శివకుమార్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో రిటర్నింగ్‌ అధికారిపై ఈసీఐ ఆగ్రహం వ్యక్తం చేస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది.