ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కేసీఆర్ కుమార్తె కవితకు సీబీఐ నోటీసులు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కుంభకోణంపై విచారణకు సీబీఐ ఎదుట హాజరుకావాలని కోరుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. 160 Crpc కింద శుక్రవారం నోటీసులు పంపించింది. కేసుకు సంబంధించిన అనేక విషయాల్లో కవితకు ప్రమేయం ఉన్నందున, సాక్షిగా పిలుస్తున్నట్టు దర్యాప్తు సంస్థ పేర్కొంది. నోటీసులో, సీబీఐ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అలోక్ కుమార్ షాహి, ఢిల్లీ, GNCT, డిప్యూటీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మరియు 14 మందిపై MHA డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ రాయ్ నుండి వచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేయబడింది. 2021-22 సంవత్సరానికి ఢిల్లీకి చెందిన జిఎన్‌సిటి ఎక్సైజ్ పాలసీపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి ఇతరులు కేసు దర్యాప్తు సందర్భంగా కవితకు సంబంధమున్నట్టుగా కొన్ని అంశాలు బయటపడ్డాయంది. అందువల్ల దర్యాప్తు దృష్ట్యా ఆ వాస్తవాలపై ఆమె పరిశీలన అవసరమని సీబీఐ నోటీసులో పేర్కొంది.

డిసెంబరు 6 మంగళవారం ఉదయం 11 గంటలకు ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కె. కవితను విచారించనున్నట్టు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నోటీసులో పేర్కొంది. నోటీసుపై కవిత స్పందించారు. తన వివరణ కోరుతూ Cr.P.C సెక్షన్ 160 కింద నాకు CBI నోటీసు జారీ చేసింది. డిసెంబర్ 6 న హైదరాబాద్‌లోని నా నివాసంలో విచారించవచ్చని అధికారులకు తెలియజేశానన్నారు. ఈ కేసులో నిందితుల్లో ఒకరైన అమిత్ అరోరాను అరెస్టు చేసిన నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నవంబర్ 30న కోర్టులో సమర్పించిన రిమాండ్ నివేదికను అనుసరించి కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. కవితతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు రాఘవ పేర్లను కూడా ఏజెన్సీ ప్రస్తావించింది. కేసును ఏజెన్సీ విచారణ మొదలుపెట్టిన తర్వాత కవిత తన ఫోన్‌లోని ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ (IMEI)ని ఆరుసార్లు మార్చుకున్నారని ఈడీ తెలిపింది. అంతేకాకుండా, ఈ విషయంపై కొనసాగుతున్న దర్యాప్తును అడ్డుకునే ప్రయత్నంలో నిందితులు డిజిటల్ సాక్ష్యాలను నాశనం చేశారని వివరించింది.

దర్యాప్తును అడ్డుకునేందుకు ఉద్దేశపూర్వకంగానే విస్తృతమైన డిజిటల్ సాక్ష్యాలను ధ్వంసం చేశారని ED పేర్కొంది. కేసును ఏజెన్సీకి అప్పగించిన తర్వాత ఈ కేసులో 36 మంది అనుమానితులు/నిందితులు 176 సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను ధ్వంసం చేశారంది. ED 170 సెల్‌ఫోన్‌లలో 17 నుండి డేటాను తిరిగి పొందగలిగింది. ఎమ్మెల్సీ కవిత, సృజన్‌రెడ్డి, అరుణ్ పిళ్లై, అభిషేక్ బోయినపల్లి, బుచ్చిబాబు గోరంట్ల, శరత్‌రెడ్డి ధ్వంసం చేసిన మొబైల్ ఫోన్‌లను కూడా కనుగొన్నట్టు ఈడీ రిమాండ్ నివేదికలో పేర్కొంది. నిందితుడు అమిత్ అరోరా, ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అక్రమ వ్యాపార పద్ధతుల్లో… లాభాలు పొందారని ED అధికారులు తెలిపారు. ఐతే ఈ ఆరోపణలు “పూర్తిగా నిరాధారమైనవి” అని కవిత ఇప్పటికే స్పష్టం చేశారు. విచారణ సంస్థలు బీజేపీ ప్రభుత్వం నియంత్రణలో ఉన్నాయని… విచారించేందుకు వాటికి పూర్తి స్వేచ్ఛ ఉందని.. తాను సహకరిస్తానని కవిత వెల్లడించారు.

ఎనిమిదేళ్ల క్రితం వచ్చిన మోడీ ప్రభుత్వం… తొమ్మిది రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలని పడగొట్టిందని కవిత విమర్శించింది. ఆయా రాష్ట్రాల్లో అనుచితమైన రీతిలో బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసిందని ఆమె ఆరోపించింది. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో ప్రధాని మోడీ కంటే ముందు ఈడీ వస్తుందని దేశంలోని ప్రతి చిన్నారికి తెలుసని…. తెలంగాణలోనూ ఇదే జరిగిందని కవిత అన్నారు. వచ్చే ఏడాది ఎన్నికలు ఉన్నందున తెలంగాణలో అదే జరుగుతోంది, రాష్ట్రంలో ప్రధాని మోడీ కంటే ముందు ED వచ్చిందని దుయ్యబట్టారు. దర్యాప్తును స్వాగతిస్తున్నామన్న కవిత… సహకరిస్తామన్నారు. బీజేపీ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తోందంటూ దుయ్యబట్టారు. ప్రధాని మోదీ జైలుకు పంపగలరని… అయినప్పటికీ తాము ప్రజల కోసం పనిచేస్తామని, బీజేపీ వైఫల్యాలను బయటపెడతామని కవిత స్పష్టం చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం సజావుగా నడుస్తోందని… రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి జరిగిన కుట్రను బయటపెట్టిన విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారన్నారు కవిత.

ఈ స్కామ్‌లో నిందితుడు అమిత్ అరోరా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్‌కు ఇచ్చిన వాంగ్మూలం తదుపరి విచారణకు కీలకంగా మారింది. అరబిందో ఫార్మాకు చెందిన పీ శరత్‌రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి నేతృత్వంలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వ ముఖ్య కార్యకర్తలకు రూ.100 కోట్లు చెల్లించినట్టు సౌత్ గ్రూప్ కాంట్రాక్టర్లను ఈడీ రిమాండ్ నివేదికలో పేర్కొంది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మరియు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రెండూ ఈ కేసును సమాంతరంగా విచారిస్తున్నాయి మరియు ఈ కేసులో ఇప్పటివరకు వ్యాపారవేత్త అభిషేక్ బోయిన్‌పల్లి, మాజీ ట్రేడ్ కమిషనర్ అరుణ్ రామచంద్ర పిళ్లై, అరబిందోకు చెందిన పి శరత్ రెడ్డిలను అరెస్టు చేశారు.