వివేకా హత్య కేసులో దూకుడు పెంచిన సిబిఐ
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో ఐదుగురు పులివెందుల వైఎస్సార్ సీపీకి చెందిన వారికి సిబిఐ నోటీసులు జారీ చేసింది. ఇటీవల వివేకా హత్య కేసులో సిబిఐ దూకుడును పెంచి విచారణ వేగవంతం చేసింది. తాజాగా పులివెందులకు చెందిన ఐదుగురికి నోటీసులు జారీ చేయటం తాజా పరిణామంగా చెప్పుకోవచ్చు. హత్య జరిగిన రోజున వీరు వివేకా హత్య కేసు విచారణ ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిని కలిసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే తాజాగా పులివెందుల బ్రాంచ్ కెనాల్ కు చెందిన ఉద్యోగి సుధాకర్ ను కడప సెంట్రల్ జైల్లో గురువారం విచారించారు. సుమారు రెండు గంటల పాటు సుధాకర్ ను సిబిఐ విచారించినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలతో పాటు వైయస్ భారతి వ్యక్తిగత కార్యదర్శి నవీన్ కు మరోసారి సిబిఐ నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గత నెలలో నవీన్ ను కడప సెంట్రల్ జైల్లో విచారించడం జరిగింది. నవీన్ తరపు న్యాయవాది సుదర్శన్ రెడ్డి సెంట్రల్ జైల్లో సిబిఐ అధికారులను కలిసినట్లు సమాచారం. నవీన్ కు సంబంధించిన కుటుంబాల వివరాలను లాయర్ తో కలిసి సిబిఐకి నవీన్ సోదరుడు ఇచ్చినట్లు తెలుస్తోంది. నవీన్ కు మరోసారి సిబిఐ నోటీసు ఇవ్వనున్నట్లు విశ్వసనీయ సమాచారం.
