PoliticsTelangana

బీఆర్ఎస్‌‌కు పొంగులేటి షాక్.. బీజేపీలో చేరేందుకు షాతో చర్చలు

ఖమ్మం రాజకీయాల్లో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ నేత మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీజేపీలోకి ఎంట్రీ దాదాపు ఖరారైంది. వైఎస్‌ జగన్‌ ఆశీస్సులతో 2013లో రాజకీయాల్లోకి వచ్చిన పొంగులేటి 2014 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థిగా .. టీడీపీ అభ్య‌ర్థి నామా నాగేశ్వ‌ర‌రావు పైన 11,974 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఆ తరువాత టీఆర్ఎస్ లో చేరారు. గత కొంతకాలంగా బీఆర్ఎస్‌లో తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన తనకు అన్యాయం జరిగిందనేలా ఇటీవల వ్యాఖ్యలు చేయడంతో బీఆర్ఎస్ సీరియస్ అయింది. ఆయనకు ప్రభుత్వం భద్రత కుదించడం, ఎస్కార్ట్‌ను తొలగిస్తూ నిర్ణయం తీసుకోవడం కలకలం రేపింది. ఈ పరిణామాల క్రమంలో దాదాపు బీఆర్ఎస్‌కు దూరంగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. త్వరలో ఆ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరడం దాదాపు ఖాయమైందని తెలుస్తోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ నెల 18న ఖమ్మంలో భారీ బహిరంగ సభకు నిర్ణయించారు. జాతీయ నేతలను ఆహ్వానించారు. ఆ సమయంలో పొంగులేటి ఢిల్లీలో మోదీ, అమిత్ షాల సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నారని సమాచారం. మోదీ, అమిత్ షాలతో భేటీ తర్వాత ఖమ్మం వేదికగా భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేయనున్నారు. ఈ మేరకు సిద్దంగా ఉండాలంటూ అనుచరులకు పొంగులేటి సూచించినట్లు సమాచారం. ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరులు విస్తృత సమావేశాలకు ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.