NationalNews

బాడుగకు బాయ్‌ఫ్రెండ్

‘వెర్రి వేయితలలు’ వేయడమంటే ఇదే. ప్రస్తుతం ఈ ఆధునిక యుగంలో మానవసంబంధాలకు విలువ లేకుండా పోయింది. సిలికాన్ సిటీగా పిలువబడే బెంగళూరులో కొందరు టెకీలు ఒక వింత స్టార్టప్‌ను ప్రారంభించారు. ‘టాయ్‌బాయ్’ అనే పేరుతో ఒక పోర్టల్‌ను ప్రారంభించారు. ప్రేమ విఫలమయ్యిందనో, ప్రియుడు మోసం చేశాడనో మనోవ్యథకు గురైన అమ్మాయిలు డిప్రెషన్‌కు లోనవకుండా ఈ ‘టాయ్‌బాయ్‌’ను వాడుకోవచ్చట. అయితే ఈ అబ్బాయి నిజంగా వారి వద్దకు భౌతికంగా రాడట. ఫోన్ ద్వారా వారి సమస్యను విని వారి మానసిక ఆందోళనను దూరం చేసేందుకు మాత్రం సహకారం అందిస్తాడని ఈ పోర్టల్‌ను అభివృద్ధి చేసిన కౌశల్ ప్రకాశ్ తెలిపారు. దీనినొక స్టార్టప్‌గా ప్రారంభించామని, దీంతో పాటు RABF అనే యాప్‌ను అభివృద్ధి చేశామని ఆయన పేర్కొన్నారు.

ఈ సేవలను నిర్ణీత రుసుము చెల్లించి, వినియోగించుకోవచ్చని ఆయన వివరించారు. మానసిక సమస్యలు, ఒంటరితనంతో బాధపడేవారికి మంచి మాటలతో ధైర్యం చెప్పడానికి, కౌన్సిలింగ్ ఇవ్వడానికి ఈ యాప్ పనిచేస్తుందని తెలిపారు. అయితే ఈ యాప్ సంచలనంగా మారింది. ఎందుకంటే గంటల లెక్కన బాయ్‌ఫ్రెండ్‌ను అద్దెకు ఇస్తామనడం భారతదేశం లాంటి సంస్కృతి, సంప్రదాయాలకు విలువలనిచ్చే దేశంలో సాహసమే.  ప్రజలు, ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయో వేచిచూడాల్సిందే.