బీజేపీ నన్ను ఆపేలేదు, వాయనాడ్‌లో రాహుల్ గర్జన
లోక్‌సభ ఎంపీగా అనర్హత వేటు పడిన తర్వాత తొలిసారిగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తాను ప్రాతినిధ్యం వహించిన కేరళ వాయనాడ్‌లో పర్యటించారు. కల్పేట పట్టణంలో ‘సత్యమేవ జయతే’ అనే రోడ్‌షోలో రాహుల్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాతో కలిసి పాల్గొన్నారు. బీజేపీ నా ఇంటిని పట్టుకోవచ్చు, జైలుకు పంపించవచ్చు. వాయనాడ్ ప్రజలకు, వారి సమస్యలకు ప్రాతినిధ్యం వహించకుండా నన్ను ఆపలేదంటూ ర్యాలీలో రాహుల్ దుయ్యబట్టారు. రాహుల్ గాంధీని పార్లమెంట్ అనర్హుడిగా ప్రకటించిన తర్వాత తొలిసారిగా ఆయన నియోజకవర్గానికి వచ్చారు. ఈ సందర్భంగా, కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమి కార్యకర్తలు, ఇండియా ఫ్లాగ్ పట్టుకొని ప్రదర్శనలో పాల్గొన్నారు. రాహుల్ సోదరి ప్రియాంక, కేరళ పార్టీ సీనియర్ నాయకులతో కలిసి ట్రక్‌పై బహిరంగ సభ వేదిక వద్దకు వెళుతున్నప్పుడు కార్యకర్తలు పోటీపడి స్వాగతం పలికారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు దేశం విడిచి పారిపోయిన వ్యాపారవేత్తలు నీరవ్ మోదీ, లలిత్ మోదీల ఇంటిపేరుపై ప్రధాని మోదీని కామెంట్ చేశారంటూ గుజరాత్ ఎమ్మెల్యే సూరత్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. 2019 పరువు నష్టం కేసును విచారించిన సూరత్ కోర్టు ఇటీవల రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించింది. దొంగలందరికీ మోదీ అనే సాధారణ ఇంటిపేరు ఎలా వచ్చిందంటూ కర్ణాటకలోని కోలార్ ఎన్నికల ప్రచారంలో ఆయన వ్యాఖ్యానించారు.