NewsTelangana

మునుగోడులో ఓడి.. గెలిచిన బీజేపీ

మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ సాంకేతికంగా ఓటమి పాలైంది. కానీ.. నైతికంగా ఆ పార్టీ విజయం సాధించినట్లేనని మునుగోడు ప్రజలతో పాటు స్థానిక బీజేపీ కార్యకర్తలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 12,725 ఓట్లు మాత్రమే సాధించిన బీజేపీ ఈసారి ఏకంగా 86,697 ఓట్లు సంపాదించడం తక్కువ విషయమేమీ కాదంటున్నారు. కాంగ్రెస్‌కు కంచుకోట అయిన మునుగోడులో ఆ పార్టీకి డిపాజిట్‌ కూడా దక్కకుండా చేయడంతో కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌ అనే బీజేపీ లక్ష్యం నెరవేరినట్లే అంటున్నారు. కమ్యూనిస్టుల అడ్డా కూడా అయిన మునుగోడులో బీజేపీకి 73,972 ఓట్లు ఎక్కువగా వచ్చాయంటే.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ ఆ పార్టీదే విజయం అనడంలో సందేహం లేదని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

తటస్థ ఓటర్లు బీజేపీ వైపే..

మునుగోడులో బీజేపీ నాయకులు, కార్యకర్తలు మంచి సమన్వయం, ప్రచార వ్యూహంతో కమలం గుర్తును క్షేత్ర స్థాయి వరకు తీసుకెళ్ల గలిగారు. ముఖ్యంగా ప్రచార తీరుతెన్నులను ఎన్నికల స్టీరింగ్‌ కమిటీ కన్వీనర్‌ వివేక్‌ వెంకటస్వామి, ఈటల రాజేందర్‌, కమిటీ సమన్వయకర్త గంగిడి మనోహర్‌ రెడ్డి దగ్గరుండి పర్యవేక్షించారు. అన్ని మండలాలకు సమర్ధులైన బాధ్యులను నియమించి ఇంటింటి ప్రచారాన్ని పకడ్బందీగా నిర్వహించడంలో సక్సెస్‌ అయ్యారు. తటస్థ ఓటర్లు కూడా బీజేపీ వైపు మొగ్గు చూపడంలో వీళ్ల పాత్ర కీలకం. సైలెంట్‌ ఓట్లు బీజేపీకి ఎక్కువగా పడటమే దీనికి నిదర్శనం. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, అగ్ర నేతలు సునీల్‌ బన్సల్‌, తరుణ్‌ చుగ్‌లు పాల్గొన్న బహిరంగ సభలకు జన సమీకరణను భారీగా చేపట్టడంలో మండల పార్టీ బాధ్యుల పాత్ర విలువైనదే.

కాంగ్రెస్‌ ఓట్లు బీజేపీ ఖాతాలోకి..

ముఖ్యంగా కాంగ్రెస్‌ ఓటు బ్యాంకును బీజేపీ వైపు మళ్లించడం ఈ ఎన్నికల్లో కాషాయ దళం సాధించిన గొప్ప విజయం. నిజానికి కాంగ్రెస్‌ ఓట్లు తమకే పడతాయని.. బీజేపీని భారీ మెజారిటీతో చిత్తు చేస్తామని నమ్మకంతో ఉన్న టీఆర్‌ఎస్‌ నాయకులు దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మొత్తానికి రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌ కాదు.. బీజేపీ అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్‌ అయ్యామని ఆ పార్టీ నేతలు సంతృప్తితో ఉన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణాలో అధికారం చేజిక్కించుకోవాలనుకుంటున్న బీజేపీ పెద్దలకు మునుగోడు మంచి సంకేతమే ఇచ్చిందని భావిస్తున్నారు.