NewsTelangana

మునుగోడులో బీజేపీ ప్లాన్‌ చేంజ్‌

మునుగోడులో బీజేపీ ప్లాన్‌ మార్చింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సోమవారం నాటి భారీ బహిరంగ సభను రద్దు చేసుకున్న కాషాయ పార్టీ తాజాగా మండలాల వారీ సభలు నిర్వహించాలని ప్లాన్‌ చేసింది. ఏడు మండలాల్లో 25 వేల మంది చొప్పున జన సమీకరణకు సన్నాహాలు చేస్తోంది. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు ఎర వివాదం నేపథ్యంలో మునుగోడులో బీజేపీ ఆచీతూచీ అడుగులేస్తోంది. ఈ సభలకు అస్సాం సీఎం హేమంత బిశ్వ శర్మ, కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ, బీజేపీ యువమోర్చా నేత తేజస్వి సూర్యతో పాటు ఇతర ముఖ్య నేతలను ఆహ్వానించింది. మండలాల్లో బైక్‌ ర్యాలీ కూడా నిర్వహించనుంది.

గ్రామాల్లో క్షేత్రస్థాయి సమీక్ష..

ప్రచారం ముగిసే వరకూ బీజేపీ రాష్ట్ర ఇంచార్జి తరుణ్‌ చుగ్‌.. మునుగోడులోనే మకాం వేయనున్నారు. చివరి రెండు రోజులు నియోజక వర్గంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సుడిగాలి పర్యటన చేస్తారు. కీలకమైన చివరి రెండు రోజుల ప్రచార బాధ్యతలను బీజేపీ కోర్‌ కమిటీ సభ్యులకు అప్పగించారు. వీళ్లు గ్రామాల్లో పర్యటిస్తూ పరిస్థితిని క్షేత్రస్థాయిలో సమీక్షిస్తున్నారు. మరోవైపు పార్టీ అధినేత కేసీఆర్‌ బహిరంగ సభకు టీఆర్‌ఎస్‌ సన్నాహాలు చేస్తోంది. కాంగ్రెస్‌ అగ్రనేతలు మాత్రం రాహుల్‌ గాంధీ పాదయాత్రలో బీజీగా ఉన్నారు. దీంతో స్థానిక నేతలే మునుగోడులో ప్రచారం చేస్తున్నారు.