Home Page SliderNational

బీజేపీ నేత, అంబాలా ఎంపీ రతన్ లాల్ కటారియా కన్నుమూత

అంబాలా ఎంపీ రతన్ లాల్ కటారియా మృతి
హర్యానా బీజేపీలో దళిత నేతగా గుర్తింపు

కేంద్ర మాజీ మంత్రి, అంబాలా ఎంపీ రతన్ లాల్ కటారి 71 ఇవాళ ఉదయం కన్నుమూశారు. కటారియా అనారోగ్యంతో గత నెల రోజులుగా చికిత్స పొందుతున్నారు. తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కటారియాకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

కేంద్ర మాజీ సహాయ మంత్రి, అంబాలా ఎంపీ రతన్ లాల్ కటారియా మృతి పట్ల హర్యానా సీఎం విచారం వ్యక్తం చేశారు. సమాజ ప్రయోజనాల కోసం, హర్యానా ప్రజల పురోగతి కోసం కటారియా ఎప్పుడూ పార్లమెంటులో గళం విన్పించారని, ఆయన నిష్క్రమణ రాజకీయాలకు పెద్ద నష్టమని చెప్పారు.కటారియా, హర్యానాలో బీజేపీ దళితనేతగా గుర్తింపు పొందారు. 2019 ఎన్నికల్లో అంబాలా నుంచి 3.42 లక్షల ఓట్ల తేడాతో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కుమారి సెల్జాపై ఆయన విజయం సాధించారు.

కటారియా 1980ల ప్రారంభంలో హర్యానా బీజేపీ అధికార ప్రతినిధిగా, 2001-2013 మధ్య పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా పనిచేశారు. కటారియా 1987లో హర్యానా ఎమ్మెల్యేగా ఎన్నికై 1999లో తొలిసారిగా ఎంపీ అయ్యారు. 2004 – 2009 ఎన్నికలలో సెల్జా చేతిలో ఓడిపోయాడు, కానీ 2014లో అంబాలా నుంచి తిరిగి ఎన్నికయ్యారు.