అందరూ కలిస్తే బీజేపీని ఓడించవచ్చు-నితీష్
2024 ఎన్నికల్లో అన్ని ప్రతిపక్షాలు కలిసి పోరాడితే బీజేపీ 50 సీట్లకు పడిపోతుందన్నారు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్. అందుకోసం తాను ఇప్పట్నుంచే పనిచేస్తానన్నారు. విపక్ష కూటమి కోసం దేశ వ్యాప్తంగా పర్యటించేందుకు ఆయన రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మొన్నటి వరకు బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నితీష్ గత నెలలో ఆ పార్టీకి గుడ్ బై చెప్పి… తిరిగి ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ప్రతిపక్ష ఐక్యత కోసం చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తానన్నారు. పాట్నాలో జరిగిన JDU కార్యనిర్వాహక సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో బీజేపీ సర్కారును ఓడించేందుకు నితీష్ కుమార్ కంకణబద్ధులు కావాలని.. ప్రతిపక్షాల ఐక్యత కోసం పనిచేయడంతోపాటు, దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీపై పోరాటం చేయాలని పార్టీ ఆయన్ను కోరింది. బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ కోసం ఇతర పార్టీల అగ్రనేతలను కలవడానికి ఢిల్లీకి వెళ్లనున్నట్లు ఆయన తెలిపారు. సోమవారం నుంచి మూడు రోజులపాటు ఢిల్లీలోని విపక్ష నేతలందరితోనూ సమావేశమవుతానని చెప్పారు నితీష్. మణిపూర్‌లో జేడీయూ నుంచి గెలిచిన ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడంతో నితీష్ అసహనంగా ఉన్నారు. ఎన్డీఏ నుంచి బయటకు రావడం ఎంతో సంతోషంగా ఉందన్న ఆయన… ఇతర పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను ఎలా చీల్చుతారని ప్రశ్నించారు.


