Home Page SliderNational

త్రిపురలో టిప్రా మోత పార్టీకి బీజేపీ బంపర్ ఆఫర్

మూడు ఈశాన్య రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో త్రిపురలో మరోసారి విజయం తర్వాత బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. త్రిపురలో అనూహ్యంగా 13 సీట్లు గెలుచుకోవడం ద్వారా సత్తా చాటిన గిరిజన పార్టీ టిప్రా మోతను తమవైపు తిప్పు కోవాలని ఆ పార్టీ భావిస్తోంది. ఫిబ్రవరి 16న జరిగిన ఎన్నికల్లో బీజేపీ 32 సీట్లు గెలుచుకోగా, దాని మిత్రపక్షమైన ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర ఒక్క స్థానమే గెలుచుకొంది. కానీ… త్రిపురలో పట్టు సాధించేందుకు బీజేపీకి టిప్ర మోత మద్దతు అవసరం లేకపోయినా, పోటీ చేసిన తొలిసారే… అద్భుత ప్రదర్శన చేసిన టిప్రా పార్టీతో సఖ్యత అవసరమని భావిస్తోంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో త్రిపురలో ఉన్న 2 స్థానాల్లో విజయం కోసం బీజేపీ వ్యూహరచన చేస్తోంది. టిప్ర మోత‌ను ప్రభుత్వంలోకి తీసుకురావాలని బీజేపీ నాయకత్వం ఆసక్తిగా ఉన్నట్టుగా తెలుస్తోంది. టిప్ర మోత ప్రతిపక్షంలో కొనసాగితే, అది అసెంబ్లీ లోపల, వెలుపల బలీయమైన ప్రతిపక్షంగా ఉంటుందని బీజేపీ భావిస్తోంది.

2024 ఎన్నికలలో, బీజేపీ ఈశాన్య రాష్ట్రాల్లో గరిష్ట స్థానాలను కైవసం చేసుకోవాలనుకుంటోంది. కానీ త్రిపురలోని గిరిజన ప్రాంతాలలో టిప్రా మోతా ప్రధాన సవాలు కావచ్చని ఆ పార్టీ అంచనా వేస్తోంది. అందుకే టిప్రా పార్టీతో చర్చలు జరపాలని ఆ పార్టీ ముఖ్యులు భావిస్తున్నారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో త్రిపురలోని రెండు ఎంపీ స్థానాలను సీపీఎం గెలుచుకొంది. దీంతో ఈసారి రెండు సీట్లను గెలుచుకోవాలని భావిస్తున్న బీజేపీ పెద్దలు అందుకు తగినట్టుగా వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. టిప్ర మోత పార్టీతో, కేంద్ర హోం మంత్రి చర్చలకు మార్గం సుగమయ్యేలా పరిస్థితి కన్పిస్తోంది. ప్రత్యేక రాష్ట్రం ‘గ్రేటర్ టిప్రాలాండ్’ కోసం గిరిజన పార్టీ డిమాండ్‌పై ఎన్నికలకు ముందు మాజీ రాజు ప్రద్యోత్ మాణిక్య డెబ్బర్మ నేతృత్వంలోని బీజేపీ, టిప్ర మోత మధ్య చర్చలు విఫలమయ్యాయి. రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌ను సమర్థించేది లేదని బీజేపీ స్పష్టం చేసింది. ప్రత్యేక టిప్రాలాండ్ ప్రధాన డిమాండ్‌ను అంగీకరించేది లేదని బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. అదే సమయంలో గిరిజన పార్టీ లేవనెత్తిన సమస్యలకు రాజ్యాంగపరమైన పరిష్కారాల కోసం తాము మద్దతిస్తామంటోంది.

త్రిపుర ముఖ్యమంత్రిగా మాణిక్ సాహా రెండోసారి ప్రమాణస్వీకారం చేసిన తర్వాత టిప్ర మోతాకు చెందిన 13 మంది ఎమ్మెల్యేలు, ఆ పార్టీ అధినేత దెబ్బుర్మతో సహా అగ్రనేతలు ఈరోజు అగర్తలాలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డాతో సమావేశమవుతారని సమాచారం. టిప్ర మోత పార్టీకి బీజేపీ మూడు మంత్రి పదవులు ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. గ్రేటర్ టిప్రా ల్యాండ్‌కు కేంద్ర మద్దతివ్వకుంటే.. తాము ప్రతిపక్షంలో కూర్చోవడమే మేలని పార్టీ చీఫ్ దెబ్బుర్మ స్పష్టం చేస్తున్నాడు. గిరిజన ప్రజలకు గౌరవప్రదమైన రాజ్యాంగ పరిష్కారం లభించే వరకు, తాము ఏ ప్రభుత్వంలోనూ భాగం కాలేమని చెప్పాడు. ప్రజల ప్రయోజనాల కోసం 13 మంది ఎమ్మెల్యేలను కలిగి ఉన్న మొదటి స్థానిక పార్టీగా నిర్మాణాత్మక పాత్ర పోషిస్తామని సోషల్ మీడియా పోస్ట్‌లో తెలిపారు. మా కమ్యూనిటీపై మా వ్యక్తిగత ఆసక్తిని చూసుకోలేమన్నారు. రాబోయే దశాబ్దంలో మా టిప్రా భవిష్యత్తును వారు ఎలా చూడాలనుకుంటున్నారనే దానిపై భారత ప్రభుత్వం నుండి అధికారిక ప్రతిస్పందన కోసం వేచి ఉంటామన్నారు.