కుక్కలకు టీకా అభివృద్ధి చేసిన ‘భారత్ బయోటెక్’
కుక్కలను పెంచుకునే యజమానులు చాలా జాగ్రత్తలు వహించవలసి ఉంటుంది. వాటికి సమయానికి సరైన టీకాలు ఇప్పించి, ఏ వ్యాధులు రాకుండా చూసుకోవాలి. తద్వారా మనుషులకు కూడా వ్యాధులు వ్యాపించకుండా చూడాలి. భారత ప్రజలకు కొవాక్సిన్ అందించిన భారత్ బయోటెక్ సంస్థ త్వరలో ‘రేబిస్’ వ్యాధి వ్యాప్తిని నిరోధించే టీకాలను అందించబోతోంది. ఈ టీకా అభివృద్ధిపై పరిశోధనలు జరుగుతున్నాయని భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ డైరక్టర్ సాయిప్రసాద్ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ‘బయోఆసియా 2023’ చర్చలో ఈ విషయం చెప్పారు. వచ్చే రెండేళ్లలో ఈ టీకా అందుబాటులోకి రానుందని తెలియజేశారు. బెంగళూరు కేంద్రంగా ఈ ప్రాజెక్టు చేపట్టారు. ఈ టీకాలను పెంపుడు కుక్కలతో బాటు వీధికుక్కలకు కూడా అందించాలనేదే తమ ఉద్దేశ్యం అన్నారు. కుక్కలు కరవడంతో రేబిస్ వ్యాధి సోకి ఏటా దేశంలో 25వేల మంది చనిపోతున్నారన్నారు. తరచూ వీధికుక్కలు పిల్లలపై దాడి చేసిన ఘటనలు హైదరాబాద్‌లో జరుగుతున్నాయి. అందుకే జంతు టీకాలు, మందుల కోసం ప్రత్యేకంగా లాబ్ ఏర్పాటు చేసి పరిశోధనలు జరుపుతున్నారు.