అయ్యన్నపాత్రుడికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
టీడీపీ సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడుకు సంబంధించిన ఫోర్జరీ కేసు దర్యాప్తునకు సుప్రీంకోర్టు సోమవారం అనుమతి ఇచ్చింది. జస్టిస్ ఎంఆర్ షా, సిటి రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఫోర్జరీ కేసుపై దర్యాప్తును ఇండియన్ పీనల్ కోడ్ (ఐపిసి) సెక్షన్ 467 కింద చేయవచ్చని స్పష్టం చేసింది. ఈ కేసులో హైకోర్టు తీర్పును కూడా అత్యున్నత న్యాయస్థానం పక్కన పెట్టింది. ఇంటి గోడ కూల్చివేత సమయంలో హైకోర్టుకు నకిలీ సర్టిఫికెట్ సమర్పించారని ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదు మేరకు సీఐడీ కేసు నమోదు చేసింది. రావణపల్లి సాగునీటి కాలువను ఆక్రమించుకుని ఇల్లు కట్టుకున్నారని అభియోగాలున్నాయి. అయ్యన్న, ఆయన కుమారుడి ఇద్దరూ దాదాపు 960 చదరపు గజాల (0.2 ఎకరాలు) ప్రభుత్వ భూమిని “నకిలీ నో-అబ్జెక్షన్ సర్టిఫికేట్”తో ఆక్రమించారని, పాత్రుడుపై ఐపిసి సెక్షన్ 467 కింద సీఐడీ కేసు నమోదు చేసింది. టీడీపీ హయాంలో నీటిపారుదల శాఖకు చెందిన 0.2 ఎకరాల భూమిని పాత్రుడు కబ్జా చేశారని మున్సిపల్ నోటీసులో పేర్కొన్నారు. జలవనరుల శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్‌ను అయ్యన్న పాత్రుడు తన ఇంటికి పిలిపించి బలవంతంగా అటెస్ట్ చేయించుకొని… కొడుకు విజయ్ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని విమర్శలున్నాయి.