శ్రీరామ నవమి సందర్భంగా 19 గంటలపాటు దర్శనమివ్వనున్న అయోధ్యరాముడు
రామనవమి సందర్భంగా సంప్రోక్షణ కార్యక్రమం తర్వాత అయోధ్యలో జరిగే మొదటి రామనవమికి భారీగా భక్తులు తరలివస్తారని భావిస్తున్నారు. అయోధ్యలోని రామాలయం బుధవారం తెల్లవారుజామున 3.30 గంటలకు మంగళ హారతి ప్రారంభమై రాత్రి 11 గంటల వరకు 19 గంటల పాటు తెరిచి ఉంటుంది. భగవంతునికి నాలుగు ‘భోగ్’ నైవేద్యాల సమయంలో ఐదు నిమిషాలు పాటు కర్టన్లు వేస్తారు. రామనవమి సందర్భంగా ప్రోక్షణ కార్యక్రమం తర్వాత అయోధ్యలో జరిగే మొదటి రామనవమికి భక్తులు భారీగా తరలివస్తారని, అందుకే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ పేర్కొంది. స్వామి దర్శనం కోసం వచ్చే అతిథులు ఏప్రిల్ 19 తర్వాత మాత్రమే రామలల్లా దర్శనం కోసం అయోధ్యను సందర్శించాలని విజ్ఞప్తి చేసింది. ఏప్రిల్ 16- 18 మధ్య రామ్ లల్లా దర్శనం, ఆరతి కోసం అన్ని ప్రత్యేక పాస్ బుకింగ్‌లను కూడా రద్దు చేశారు. రామమందిరంలోకి ప్రవేశించడానికి ఇతర భక్తులు అనుసరించే మార్గాన్నే, అందరూ అనుసరించాల్సిన అవసరం ఉందని ట్రస్ట్ తెలిపింది.

“రామ నవమి రోజున, బ్రహ్మ ముహూర్తం సమయంలో తెల్లవారుజామున 3:30 గంటలకు ప్రారంభమై, భక్తులు దర్శనం కోసం క్యూలో నిలబడటానికి ఏర్పాట్లు ఉంటాయి. భక్తులు రాత్రి 11 గంటల వరకు రామ్ లల్లా దర్శనం చేసుకోగలరు” అని పేర్కొంది. దర్శన సమయంలో అసౌకర్యం, సమయం వృథా కాకుండా ఉండేందుకు భక్తులు తమ మొబైల్ ఫోన్లు, ఇతర విలువైన వస్తువులను తీసుకురావద్దని సూచించారు. యాత్రికుల కోసం సుగ్రీవ్ క్విలా వద్ద ట్రస్ట్ ద్వారా సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దూరదర్శన్‌లో రామమందిరంలో వేడుకలను ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. ట్రస్ట్ ప్రకారం, అయోధ్య మునిసిపల్ కార్పొరేషన్ రామ మందిరంలో రామనవమి వేడుకల ప్రత్యక్ష ప్రసారం కోసం అయోధ్య అంతటా దాదాపు 100 LED స్క్రీన్‌లను ఏర్పాటు చేస్తుంది. రామనవమి సందర్భంగా, 1,11,111 (లక్షా పదకొండు వేల నూట పదకొండు కిలోల లడ్డూ ప్రసాదం) పంపిణీ కోసం ఏప్రిల్ 17 న అయోధ్యలోని రామాలయానికి చేరుకుంటాయి. ప్రసాదం కోసం ఈ లడ్డూలను దేవ్‌రహ హన్స్ బాబా ట్రస్ట్ పంపుతుంది. జనవరి 22, 2024న అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠా రోజున దేవ్రహ హన్స్ బాబా ఆశ్రమం 40,000 కిలోల లడ్డూను నైవేద్యంగా పంపింది.