మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో థాక్రేకు రాహుల్, పవార్ హ్యాండిస్తారా !? (Spl Analysis)
కేంద్రంలో బోటాబోటీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమికి మరోసారి చెక్ పెట్టాలని ఇండియా కూటమి ప్రయత్నస్తోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబై కేంద్రంగా ఈ ఏడాది ఆఖరులో జరగనున్న అసెంబ్లీ ఎన్నిక్లలో మోదీ సర్కారును దెబ్బకొట్టాలని కాంగ్రెస్ గట్టిగా భావిస్తోంది. మోదీకి టెక్ పెట్టాలంటే అందుకు మహారాష్ట్ర దగ్గర దారి అని ఆ పార్టీ భావిస్తోంది. అందుకే ఈసారి మహారాష్ట్రలో కూటమి ద్వారా అధికారాన్ని కైవశం చేసుకోవాలని మహా వికాస్ అగాడీ కూటమి సభ్యులు శివసేన (ఉద్దవ్ థాక్రే వర్గం), ఎన్సీపీ (శరద్ పవార్ వర్గ), కాంగ్రెస్ పార్టీలు గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో మరోసారి సీఎంగా పగ్గాలు చేపట్టాలంటే అందుకు తన మాటే చెల్లుబాటు కావాలని శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే యోచిస్తున్నారు.

అందులో భాగంగా ఆయన ఇటీవల ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, శరద్ పవార్‌లతో సమావేశమయ్యారు. లోక్ సభ ఎన్నికలకు మించి, అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్ నాథ్ షిండే, బీజేపీని దెబ్బ కొట్టాలని మూడు పార్టీలు భావిస్తున్నాయి. యాంటీ ఇన్‌కంబెన్సీని అస్త్రంగా చేసుకొని అధికారంలోకి రావాలన్న ఆలోచనలో మూడు పార్టీలున్నాయి. 2024లో జరిగిన సాధారణ ఎన్నికల సమయంలో, శివసేన (UBT) 21 స్థానాల్లో, కాంగ్రెస్ 17, NCP (SP) 10 స్థానాల్లో పోటీ చేసింది. శివసేన (UBT) 21 స్థానాల్లో పోటీ చేయగా తొమ్మిది మాత్రమే గెలుచుకుంది. కాంగ్రెస్ 13, ఎన్సీపీ 8 స్థానాలను గెలుచుకున్నాయి. శివసేనతో పోల్చుకుంటే కాంగ్రెస్స, ఎన్సీపీ మంచి విజయాలు దక్కించుకొని పోటీ చేసిన సీట్లలో మెజార్టీ సీట్లను దక్కించుకోగా, శివసేన వెనుకబడింది. లోక్ సభ ఎన్నికల్లో శివసేన పర్ఫామెన్స్ అంతగా మేరుగ్గా లేదన్న కారణంగా ఈసారి ఆ పార్టీకి ఇచ్చే సీట్లలో కోత పెట్టాలని కాంగ్రెస్, ఎన్సీపీ భావిస్తున్నాయి. గతంలోలా సీట్ల సర్దుబాటుకు ఇప్పుడు చాన్స్ ఉండే అవకాశం కన్పించడం లేదు.

అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన (యూబీటీ) మళ్లీ అత్యధిక స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తోంది. కాంగ్రెస్ కూడా అత్యధిక స్థానాల్లో పోటీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. చీలికల కారణంగా శివసేన, ఎన్‌సిపి రెండూ బలహీనపడ్డాయని, భారీగా సీట్లను కేటాయించినా గెలుపు కష్టమన్న భావన ఉంది. 2019 ఎన్నికల్లో యూపీఏలో భాగంగా కాంగ్రెస్ 147 స్థానాల్లో, ఎన్‌సిపి (చీలికకు ముందు) 121 స్థానాల్లో పోటీ చేయగా, శివసేన సైతం బీజేపీతో పొత్తులో భాగంగా చీలికకు ముందు 126 స్థానాల్లో బీజేపీతో పొత్తులో భాగంగా సర్దుబాటు చేసుకున్నాయి. మరోవైపు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది మరో వివాదాస్పదం అయ్యే అవకాశం కన్పిస్తోంది. కూటమి సీఎం అభ్యర్థిగా ఉండాలా వద్దా అనేది ఎంవీఏ నాయకత్వమే నిర్ణయించాలని ఉద్ధవ్ థాక్రే పేర్కొన్నారు. శివసేన సీఎం అభ్యర్థి కోసం వాదిస్తుంటే, కాంగ్రెస్-ఎన్‌సిపి, రెండు పార్టీలు కూడా ఎవరిని ప్రకటించకుండానే ఎన్నికలకు వెళ్తే మేలని భావిస్తున్నాయి. ప్రతి పార్టీ ఎన్నికల్లో సాధించే సీట్ల ఆధారంగా ఉన్నత పదవిని నిర్ణయించాలన్న చర్చ కూడా ఆ రెండు పార్టీల మధ్య ఉంది.

పరిశీలనలో ఉన్న వివిధ సీట్-షేరింగ్ ఫార్ములాలు:
1) మూడు పార్టీలు-శివసేన (యుబిటి), ఎన్‌సిపి (ఎస్‌పి) కాంగ్రెస్- దాదాపు 90-95 సీట్లలో పోటీ చేస్తాయని, మిగిలిన వాటిని చిన్న చితకా పార్టీలకు వదిలివేయాలని ప్రతిపాదన ఉంది. 2019 ఎన్నికలలో, శివసేన (చీలికకు ముందు) 56 సీట్లు గెలుచుకోగా, NCP (చీలికకు ముందు) 54, కాంగ్రెస్ 44 చోట్ల గెలుపొందాయి. ఈ పార్టీలు గతంలో గెలిచిన 154 స్థానాలపై మొదటి హక్కును కలిగి ఉంటాయన్న వర్షన్ విన్పిస్తోంది. మిగిలిన 134 స్థానాలు ప్రస్తుత బలం, గతంలో పార్టీ బలాలు ఇటీవలి సార్వత్రిక ఎన్నికల ట్రెండ్‌ల ఆధారంగా కేటాయించాలన్న చర్చ ఉంది. శివ సేన, ఎన్‌సిపికి చెందిన చాలా మంది ఎమ్మెల్యేలు, తాము వచ్చే ఎన్నికల్లో కేవలం ఉద్ధవ్ థాక్రే, శరద్ పవార్‌ల అండతోనే గెలవగలమన్న విశ్వాసంలో లేరు. ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ వర్గాలు తమకు మద్దతివ్వాలన్న అభిప్రాయం వారిలో ఉంది.

2) గత ఎన్నికల్లో ఆయా పార్టీలు విజేతగా నిలిచాయా, లేదా రెండో స్థానంలో ఉన్నాయా అనే దాని ఆధారంగా సీటు కేటాయించాలన్న చర్చ ఉంది. 2009 నుంచి మహారాష్ట్రలో బీజేపీ మినహా అన్ని పార్టీల ప్రాభవం తగ్గింది. 2019లో కాంగ్రెస్ 113 సీట్లకు పైగా, సేన 110 కంటే ఎక్కువ, ఎన్‌సిపి 101 కంటే ఎక్కువ స్థానాల్లో బలం ఉంది. దీని ప్రకారం ఆ సీట్ల సంఖ్య 324 కాగా, అసెంబ్లీ బలం కేవలం 288. సో కొన్ని చోట్ల రెండు పార్టీలు కూడా బలంగా ఉన్నప్పుడు, ఆ సీటును ఎవరికి ఎలా ఇవ్వాలన్నదానిపై చర్చ జరగాల్సి ఉంది. మొత్తంగా 39 స్థానాల్లో కాంగ్రెస్/ఎన్‌సీపీ విజేతగా ఉంటే శివసేన రెండో స్థానంలో నిలిచింది. శివసేన విజేతగా నిలిచిన 32 స్థానాల్లో… కాంగ్రెస్-ఎన్‌సీపీ రెండో స్థానంలో నిలిచాయి. ఆ 32 స్థానాలను సర్దుబాటు చేసుకుంటే, మూడు పార్టీలకు కలిపి 253 స్థానాలను తీసుకొని మిగతా 35 సీట్లను తర్వాత సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది.

3) గత మూడు ఎన్నికల్లో శివసేన రెండు లేదా మూడు సార్లు గెలిచిన 50 సీట్లు, కాంగ్రెస్ 44 సీట్లు, ఎన్సీపీ 43 సీట్లను గెలుపొందాయి. ఈ 137 బలమైన సీట్లను ఈ పార్టీలు క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. అదనంగా, ఈ పార్టీలు గత మూడు ఎన్నికలలో 167 సీట్లు గెలుచుకున్నాయి. అప్పుడు ఆ సంఖ్య 304 అవుతుంది. ఆ సంఖ్య అసెంబ్లీ బలం 288 కంటే 16 ఎక్కువ. ఇలాంటి పరిస్థితిని అధిగమించేందుకు ఆయా స్థానాల్లో ఎక్కువ సార్లు విజేతగా నిలిచిన పార్టీకి సీటు కేటాయించే అవకాశం ఉంది. ప్రాంతీయ నేపథ్యం కూడా సీట్ల కేటాయింపులో కీలకం కానుంది. విదర్భ, ముంబైలోని కొన్ని ప్రాంతాలు, మరఠ్వాడాలో కాంగ్రెస్ బలంగా ఉంది. ముంబై- థానే-కొంకణ్ ప్రాంతాలలో శివసేన బలంగా ఉంది. పశ్చిమ మహారాష్ట్ర, ఉత్తర మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో NCP బలంగా ఉంది. ఇండియా కూటమి లోక్‌సభ పనితీరు ఆధారంగా అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయం సాధించాలని చూస్తోంది. ఎన్డీయేకు కూడా టిక్కెట్ల పంపిణీ సవాల్‌గా మారింది.

